iDreamPost
android-app
ios-app

కాలుష్య నివారిణిగా మారిన కరోనా..

కాలుష్య నివారిణిగా మారిన కరోనా..

దేశ రాజధానిలో కాలుష్యం కోరలు చాచింది.. గాలిలో తగినంత ఆక్సిజన్ లభించక నగరవాసులు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడేవారు. ఆక్సిజన్ అమ్మకాలు కూడా ఢిల్లీలో మొదలుపెట్టడానికి కొందరు సన్నహకాలు కూడా చేసారు. కానీ ఇప్పుడు కొంతలో కొంత పరిస్థితి మెరుగు పడింది..

లాక్ డౌన్ విధించడంతో వాహనాలు బయట తిరిగే అవకాశం లేదు.. దాంతో కాలుష్య శాతం గణనీయంగా తగ్గడంతో ఢిల్లీలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.వాహన,పరిశ్రమల కాలుష్యం తగ్గి గాలిలో స్వచ్ఛత శాతం పెరగడం వల్ల ఇప్పుడు కాలుష్య పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

దేశంలోనే అత్యంత మురికి నదిగా పేరు తెచ్చుకున్న యమునా నది ఇప్పుడు కాలుష్యం లేకపోవడం వల్ల తేటతెల్లగా మారిపోయింది. గతంలో యమునా నది తెల్లటి నురుగులతో,మురికితో కాలుష్యంతో కనిపించేది. కాగా పరిశ్రమల కాలుష్యం, వాహన కాలుష్యం తగ్గడంతో యమునా నది స్వచ్ఛంగా మారింది.

పంజాబ్ లోని జలంధర్ నగరంలో కొన్నిరోజుల క్రితం కనిపించిన దృశ్యాన్ని చూసి నగర ప్రజలు ఆశ్చర్య పోయారు. నగరంలో పరిశ్రమలు వాహనాలు మూతపడటంతో కాలుష్యం స్థాయి తగ్గిపోయి గాలిలో స్వచ్ఛతా ప్రమాణాలు పెరిగాయి. అందుకే దశాబ్దాల క్రితం కనిపించిన రమణీయ,కమనీయ దృశ్యం జలంధర్ లో కనిపించడం మొదలైంది.. దాదాపు 213 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌలధర్ కొండలు స్పష్టంగా జలంధర్ నగర వాసులకు కనిపించి కనువిందు చేసాయి. మనిషి సృష్టించిన కాలుష్యం తగ్గిస్తే ప్రకృతి ఎంత రమణీయంగా మారుతుందో ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుంది.

బెంగుళూరులో లాక్ డౌన్ కారణంగా వాహన కాలుష్యం భారీగా తగ్గిపోయింది.. దీంతో గాలిలో స్వచ్ఛత శాతం భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ప్రజలు బయట తిరగకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో వన్యప్రాణుల నిర్భయంగా రోడ్లపై తిరుగుతున్నాయి..

కొన్నిరోజులు ప్రజలు పరిశ్రమలు, వాహనాలకు దూరంగా ఉంటేనే ప్రకృతిలో కాలుష్యం ఇంతగా తగ్గితే కాలుష్యాన్ని మరింతగా కంట్రోల్ చేస్తే ప్రకృతి ఎంతగా స్వచ్చంగా మారిపోతుందో అనడానికి ప్రస్తుతం స్వచ్ఛంగా మారిన నదులు, కాలువలు, గాలి నిదర్శనంగా కనబడతాయి.

ఇదే పరిస్థితి కొనసాగితే నదులు పూర్తిగా కాలుష్య రహితంగా మారిపోతాయి.. గాలిలో స్వచ్ఛత ఏర్పడి,తగ్గుతున్న ఆక్సిజన్ పరిణామం పెరుగుతుంది.. గ్రీన్ హౌస్ వాయువులు వల్ల సంభవించే గ్లోబల్ వామింగ్ అదుపులోకి వస్తుంది.. కరోనా ప్రజలకు ఎంత చేటు చేస్తుందో చెప్పలేం కానీ ప్రకృతికి మాత్రం మంచి చేస్తుంది అని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.. ఈ మాటలో నిజం కూడా ఉంది..