లీకైన ముఖ్యమంత్రి వీడియో క్లిప్పులు- త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రభావం చూపేనా?

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న 24 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలు అధికార పీఠంపై ప్రభావం చూపనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార బిజెపి ప్రభుత్వ సారధి శివరాజ్ సింగ్ చౌహాన్,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై సంధించిన ఒక అస్త్రం బూమ్ రాంగ్ అయి తిరిగి ఆయన మెడకే చుట్టుకుంది. అధికారాన్ని చేజార్చుకోని డీలా పడిన కాంగ్రెస్‌కు అనుకోకుండా లభించిన ప్రచార అస్త్రంతో ముఖ్యమంత్రి చౌహాన్‌పై విమర్శల దాడిని తీవ్రతరం చేసి ప్రజల సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తుంది.

నాలుగు రోజుల క్రితం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండోర్‌లోని సాన్వర్‌లో బిజెపి పార్టీ కార్యకర్తల సమావేశంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.ఆ సమావేశంలో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే తాము కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేసినట్లు వెల్లడించారు.పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడిన విషయాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు వైరల్‌గా మారి ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.అయితే నేడు (గురువారం) సీఎం చౌహాన్ పాపులను నాశనం చేయడమే పవిత్రమైన చర్య అని తన మాటలను సమర్థించుకున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి చౌహాన్ ,” పాపియోన్ కా వినాష్ కర్ణ తోహ్ పుణ్య కా కామ్ హై. హమారా ధర్మ్ టు యాహి కేహతా హై. క్యోన్? బోలో! సియాపతి రామ్‌చంద్ర కి జై ” (పాపులను నాశనం చేయడం ఒక పవిత్రమైన చర్య. మన మతం అలా చెబుతుంది. కాదా?) అని ట్వీట్ చేశారు. దీంతో కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్ర పూరితంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూల్చిందని కాంగ్రెస్ ఆరోపణలను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఒప్పుకొన్నట్లేననే రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో సీఎం ఆడియో,వీడియో క్లిప్ వైరల్ అయిన తరువాత అధికార బిజెపి,ప్రతిపక్ష కాంగ్రెసుల మధ్య తీవ్రస్థాయిలోమాటల యుద్ధం నడుస్తుంది.గురువారం బిజెపి సీనియర్ నాయకులు గోవింద్ మాలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ తయారు చేసిన నకిలీ వీడియో అని ఆరోపించాడు.కాగా వీడియో క్లిప్‌ను తానే విడుదల చేసినట్లు ప్రకటించుకున్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా వాటి ప్రామాణికతపై బిజెపి ప్రభుత్వానికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

వైరల్ అయిన వీడియో క్లిప్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పార్టీ హైకమాండ్ తనకు ఆదేశాలు ఇచ్చిందని,అలా చేయకపోతే కాంగ్రెస్ అన్నిటిని నాశనం చేస్తుందని చెప్పినట్లు ముఖ్యమంత్రి చౌహాన్ చేసిన వ్యాఖ్యలను మనం స్పష్టంగా వినవచ్చు.అయితే తాజాగా సీఎం చౌహాన్ చేసిన ట్వీట్ తో వైరల్ అయిన ఆడియో మరియు వీడియో క్లిప్‌లు ఒరిజినల్ అయినవే అని తేలింది.కుట్రపూరితంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాల ద్వారా ఆకర్షించి అధికారం నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించిందని మాజీ సీఎం కమల్ నాథ్ తో సహా కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు నిరూపించబడ్డాయి.

అంతకుముందు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా ఆడియో క్లిప్ ను ‘ తయారు’ అని పిలిచారు. పైగా బుర్రలను ఉపయోగించకుండా వీడియో క్లిప్‌లను తయారు చేసినట్లు ఎద్దేవా చేశాడు. మా పార్టీ కార్యక్రమాలన్నీ హైకమాండ్ సూచనల మేరకు చేపడతామని ఇందులో అభ్యంతరకరమైనది ఏమీ లేదని విజయ్ వర్గియా పేర్కొనడం గమనార్హం. తమ ప్రభుత్వాన్ని కూల్చి వేయడంపై సుప్రీంకోర్టులో న్యాయపరమైన పోరాటం చెయ్యడం,అలాగే రాష్ట్రపతిని సంప్రదిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.దీనిపై స్పందించిన జాతీయ ప్రధాన కార్యదర్శి వర్గియా వారు ఎక్కడికైనా వెళ్లడానికి స్వేచ్ఛ ఉందని వ్యంగంగా వ్యాఖ్యానించాడు.

అలాగే 14 నెలల పదవీకాలంలో కమల్ నాథ్ ప్రభుత్వం రైతులను మోసగించడం, ఇసుక తవ్వకం,లిక్కర్, పోస్టింగ్ పరిశ్రమలలో అక్రమాలకు పాల్పడిందని విజయ్ వర్గియా తీవ్ర ఆరోపణలు చేశారు.చౌహాన్ క్లిప్‌లో ప్రస్తావించిన మాజీ మంత్రి సిలావత్ కూడా గురువారం తన వైఖరిని తెలిపాడు. మమ్మల్ని వీధుల్లోకి వెళ్ళమని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అడిగారు,అందుకే మేము అలా చేసాము అని చెబుతూ కమల్ నాథ్ యొక్క పాత ప్రకటనను ప్రస్తావించాడు. ఇక త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం శివరాజ్ చౌహాన్ వీడియో క్లిప్‌లు ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show comments