గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం సమీక్ష.. ఘటన వివరాలు వెల్లడించిన కలెక్టర్ వినయ్ చంద్

విశాఖ ఎల్జి పాలిమర్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి విశాఖ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలుత కింగ్ జార్జ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు ఆ సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు గురించి వారి నుంచి తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన తీరును విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్యలో గ్యాస్ లీక్ అయిందని కలెక్టర్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఉదయం 5 గంటల నుంచి సహాయక చర్యలు ప్రారంభించామని తెలిపారు. అంబులెన్స్ ఉదయం 5 గంటలకు ఘటనాస్థలికి చేరుకుందని వివరించారు.

ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో చుట్టుపక్కల గ్రామాలైన వెంకటాపురం, పద్మనాభపురం, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ప్రభావితం అయ్యాయని కలెక్టర్ వినయ్ చంద్ వివరించారు. అత్యధికంగా వెంకటాపురం ప్రభావితం అయిందని చెప్పారు. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 22 ఆవులు గేదెలు మృత్యువాత పడ్డాయని చెప్పారు. గ్యాస్ లీకేజీ చుట్టుపక్కల 1.5 కిలోమీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించిందని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి మ్యాప్ రూపంలో గ్యాస్ వ్యాప్తిని కలెక్టర్ సీఎం జగన్కు వివరించారు. 24 గంటల లోపు ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితిని తీసుకొస్తామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.

Show comments