పాదయాత్రే మార్గదర్శి : సీఎం జగన్‌

తన ప్రజా సంకల్ప పాదయాత్రే ప్రస్తుతం పాలనలో సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలుకు మార్గదర్శి అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ఈ నెల 30వ తేదీ నాటికి వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కావస్తున్న తరుణంలో ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు రోజుకోక అంశంపై ‘మన పాలన – మీ సూచన’ పేరుతో ప్రత్యేక సదస్సులను ప్రభుత్వం నిర్వహించతలపెట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ‘పరిపాలన సంస్కరణలు – సంక్షేమం’ అనే అంశంపై జరిగిన సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

ప్రజలకు ప్రభుత్వాన్ని వారి ఇంటి ముందుకు తీసుకెళ్లడం, అవినీతి రహితంగా పథకాలు, పాలన సాగించడమే లక్ష్యంగా పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు. ఇందులో భాగమే గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ అని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు అర్హతే ఆధారంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఎదురుచూపులు, నాయకుల చుట్టూ తిరగడాలు, లంచాలు.. లేకుండా కులం, మతం, ప్రాంతం, పార్టీ, రాజకీయాలు చూడకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ఇస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యుడు ఉదయించక ముందే వాలంటీర్లు అవ్వా, తాతల వద్దకు వెళ్లి పింఛన్‌ నగదు చిరునవ్వుతో అందించడం గొప్ప విషయమన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్రంలోని యువతీ, యువకులకు 1.30 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఇందులో 82.7 శాతం ఉద్యోగులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని చెప్పారు, మరో 2.70 లక్షల వాలంటీర్‌ పోస్టులు ఇచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఏడాదిలోనే 4 లక్షల మందికి ఉద్యోగులు ఇచ్చామని తెలిపారు.

మెనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి ఏడాదిలోనే మెనిఫెస్టోలో ప్రకటించిన పథకాల అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వాస్పత్రులు, పాఠశాలలను నాడు – నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునేలా పరిపాలనలో గొప్ప మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. త్వరలో ఇంటింటికి బియ్యం పంపిణీ చేస్తామని, ఇప్పటికే శ్రీకాకుళంలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టామని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, రేపు మంగళవారం వ్యవసాయం, అనుంబంధ రంగాలపై సదస్సు జరగనుంది.

Show comments