పరిశ్రమలకు ఆ భరోసా ఇవ్వగలం : సీఎం జగన్‌

రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగిన సదస్సులో సీఎం మాట్టారు. వేధింపులు లేకుండా పూర్తి సహకారంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాయతీలు ఇచ్చేందుకు గతంలో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టజెప్పే పరిస్థితి ఉందని, ఆ స్థితి మన ప్రభుత్వంలో ఉండబోదన్నారు. ఎప్పటి రాయతీలు అప్పుడే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పరిశ్రమలకు భారీగా రాయతీలు వచ్చేవని సీఎం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా కూడా తెచ్చుకోలేకపోయిందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లు ప్రజలు ఇచ్చారని, కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేదన్నారు. బలమైన ప్రభుత్వం ఏర్పడడంతో ప్రస్తుతం ప్రత్యేక హోదా మనకు కొంచెం దూరంగా జరిగిన పరిస్థితి ఉందన్నారు.

అడగడం మానేస్తే ఏదీ రాదన్న విషయం తెలిసిన వ్యక్తిగా.. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం అడుగుతూనే ఉంటామని సీఎం జగన్‌ చెప్పారు. ఈ రోజు కాకపోయినా రేపు కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు.. మనకు ప్రత్యేక హోదా ఇస్తేనే మద్ధతు ఇస్తామని చెప్పి హోదా సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినంత మేరకు పరిశ్రమలకు రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. విద్యుత్, నీరు, మౌలిక సదుపాయల విషయంలో కొరత రాకుండా చూస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం మాదిరిగా లేనిపోని మాటలు చెప్పబోమని సీఎం జగన్‌ అన్నారు. ఏమి చేయగలమో.. అదే చెప్తామన్నారు. రోజుకో దేశం తిరిగి.. 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలంటూ గత పాలకులు మాదిరిగా మోసం చేసే పని చేయబోమన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి స్నేహపూర్వక వాతావరణంలో అన్ని అనుమతులు వేగంగా ఇచ్చి, అండగా ఉంటామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Show comments