iDreamPost
android-app
ios-app

ఇక్కడ యముడు అక్కడ ఫ్రెండు – Nostalgia

  • Published Mar 16, 2020 | 8:16 AM Updated Updated Mar 16, 2020 | 8:16 AM
ఇక్కడ యముడు అక్కడ ఫ్రెండు – Nostalgia

సినిమా పరిశ్రమలో అంతా కమర్షియల్ అనుకుంటాం కానీ ఇక్కడ కూడా చాలా గొప్ప స్నేహ బంధాలు ఉంటాయి . అందులోనూ రజనికాంత్, చిరంజీవిలు వీటికి పెట్టింది పేరు. ఈ కాంబోలో చాలా ఏళ్ళ క్రితం అంటే 80వ దశకం ప్రారంభంలో కాళి, బందిపోటు సింహం లాంటి సినిమాలు వచ్చాయి కాని ఇద్దరూ పెద్ద స్టార్లయ్యాక మాత్రం కలిసి నటించలేదు. ఎవరికి వారు విడివిడిగా పోటీ హీరోలు అందుకోలేని స్థాయికి చేరుకోవడంతో ఈ కాంబినేషన్ సెట్ చేయడం ఎవరి వల్లా కాలేదు. కాని అలాంటి అరుదైన ఫీట్ 1989లో వచ్చింది.

ఆ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్టో అందరికీ తెలిసిందే. పాత రికార్డులు దీంతోనే బద్ధలయ్యాయి. వాణిశ్రీ, చిరంజీవి మధ్య పోటాపోటీగా నడిచే సన్నివేశాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దీన్ని తమిళ్ లో కూడా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు అల్లు అరవింద్. ఈ సబ్జెక్టుని మోసే సత్తా ఒక్క రజనికాంత్ కే ఉందని సినిమా చూపించి ఒక్క మీటింగ్ లోనే ఓకే చేయించుకున్నారు. మాపిల్లై(అల్లుడు) టైటిల్ తో శ్రీవిద్య అత్తగా, విజయశాంతి స్థానంలో అమల హీరొయిన్ గా దీన్ని పూర్తి చేశారు.

అయితే తమిళంలోనూ గుర్తింపు ఉన్న చిరంజీవితో ఇందులో క్యామియో చేయిస్తే దాన్ని అక్కడి వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారని గుర్తించి రజనికాంత్ పెళ్లి సందర్భంగా వచ్చే ఎపిసోడ్ లో చిరుతో ఫైట్ ట్రాక్ పెట్టించారు. అది బ్రహ్మాండంగా పండింది. ఆ సందర్భంలో తీసిందే ఈ పిక్. అక్కడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. తెలుగు వెర్షన్ కు చక్రవర్తి సూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వగా దానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇళయరాజా అహో అనిపించారు. దీని తర్వాత రజినీకాంత్, చిరంజీవిలను ఒకేసారి స్క్రీన్ మీద చూసే ఛాన్స్ ప్రేక్షకులకు దక్కలేదు. అందుకే ఈ రేర్ మూమెంట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మాపిల్లైని ఆంధ్రా అల్లుడు పేరుతో డబ్బింగ్ చేస్తే ఇక్కడా బాగానే ఆడింది. అది స్టార్ పవర్ కున్న మేజిక్.