Idream media
Idream media
విశాఖను వ్యతిరేకించి ఉత్తరాంధ్రలో యాత్రా ??
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారు. బస్సులో పలు ప్రాంతాలమీదుగా సాగుతూ ప్రజలతో ముచ్చటిస్తారు. కార్యకర్తలకు ఉత్తేజం కలిగిస్తారు. వాస్తవానికి ఆయన రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్యాడర్ ను నిలబెట్టుకునేందుకు,వారికి నైతిక మద్దతు తెలిపేందుకే వస్తున్నారు. కానీ బయటకు చెప్పేది మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పేందుకని, వారికి అండగా తానున్నానని చెప్పేందుకని అంటున్నారు. అయితే ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత ఉత్తరాంధ్ర రావడం ఇదే తొలిసారి.
విశాఖను వద్దని ఎలా వస్తున్నారు !!!
రాజధాని అమరావతిని మార్చొద్దని పేర్కొంటూ రెండు నెలలుగా అక్కడ తెలుగుదేశం ప్రేరేపితమైనదిగా చెబుతున్న ఉద్యమం సాగుతోంది. ఆ సమావేశాల్లో టిడిపి నేతలు, ముఖ్యంగా చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి పాల్గొనడమే కాకుండా ఆమె ఓ ప్లాటినం గాజును విరాళంగా ఇచ్చి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఆ తరువాత చంద్రబాబు , లోకేష్ తదితరులు భిక్షాటన చేసి ఫండ్స్ సమీకరించి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అదే తరుణంలో విశాఖను పరిపాసలనా రాజధానిగా చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖలో పాలనా రాజధాని వద్దేవద్దని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
విశాఖవద్దు..అమరావతి ముద్దు అంటూ సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేస్తున్నారు.మొన్నటికిమొన్న ఎంపీ నందిగామ సురేష్ మీద అమరావతి ఉద్యమకారుల ముసుగులో టిడిపి మద్దతుదారులు దాడి కూడా చేసారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధిని వికేంద్రీకరిస్తామన్న జగన్ ఆలోచనలను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్ర వస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆయనకు అమరావతే ముఖ్యం అన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఎందుకు , ఎమ్ ప్రయోజనం కోసం పర్యటిస్తున్నారన్నది చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంది. విశాఖ అంటేనే ఆగ్రహంతో ఊగిపోతున్న ఆయన ఇప్పుడు ఎందుకు వస్తున్నారు..ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.
గో బ్యాక్ బాబు…
ఉత్తరాంధ్ర పట్ల అంత విద్వేషం ఉన్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని విశాఖ వస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ను విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. బాబు గో బ్యాక్ అని నినదిస్తూ ఆయన్ను మళ్ళీ అమరావతి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పెద్దసంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించగా అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది..విశాఖపై విషంగక్కిన చంద్రబాబు మళ్ళీ ఇక్కడికి రావడానికి సిగ్గులేదా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు…