iDreamPost
android-app
ios-app

రాజకీయాల నుండి చంద్రబాబును బహిష్కరించాలి..బిజెపి సంచలనం

  • Published Jun 15, 2020 | 3:26 AM Updated Updated Jun 15, 2020 | 3:26 AM
రాజకీయాల నుండి చంద్రబాబును బహిష్కరించాలి..బిజెపి సంచలనం

చంద్రబాబునాయుడుపై కమలంపార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజకీయాల నుండి ఎవరినైనా బహిష్కరించాల్సొస్తే ముందు చంద్రబాబునే బహిష్కరించాలని డిమాండ్ చేశాడు. దేశ రాజకీయాల నుండి చంద్రబాబు బహిష్కరించక తప్పదని సోము పిలుపినిచ్చాడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీపై సోము ఒక్కసారిగా ఇంత సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాజకీయాల్లో చంద్రబాబుకు మించిన అబద్ధాల కోరు ఇంకోళ్ళుండరని కూడా మండిపోయాడు.

ప్రపంచంలో అబద్ధాల కోరులు ఎవరా అని చూస్తే చంద్రబాబే మొదటివరసలో ఉంటాడంటూ రెచ్చిపోయాడు. తమ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దమ్ముంటే విచారణ జరిపి పట్టుకోవాలని, చర్యలు తీసుకోవాలని గతంలో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాలు చేసింది చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలని ఎద్దేవా చేశాడు. చంద్రబాబు అండ్ కో చేసిన చాలెంజ్ ప్రకారమే అవినీతిపై జగన్ దర్యాప్తు చేయించి అరెస్టులు మొదలుపెడితే ఎందుకు యాగీ చేస్తున్నాడంటూ చంద్రబాబును కమలంపార్టీ సీనియర్ నేత నిలదీశాడు.

నేరాలకు కులానికి సంబంధం ఏమిటని కూడా వీర్రాజు సూటిగా చంద్రబాబును ప్రశ్నించాడు. ఇఎస్ఐ కుంభకోణంలో జరిగిన అవినీతిపై మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును జగన్ సర్కార్ అరెస్టు చేస్తే బిసి నేతపై వేధింపులంటూ చంద్రబాబు కుల ప్రస్తావన చేయటాన్ని తప్పు పట్టాడు. అచ్చెన్న విషయంలో తెస్తున్న కుల ప్రస్తావనను జేసి ప్రభాకర్ రెడ్డి విషయంలో ఎందుకు తేవటం లేదని సోము పెద్ద లాజిక్కే లాగాడు.

జేసి ట్రావెల్స్ వ్యవహారంలో జరిగిన అక్రమాలను అధికారులు ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాతే ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయాన్ని సోము గుర్తు చేశాడు. అచ్చెన్న విషయంలో తెచ్చిన సామాజికవర్గాల ప్రస్తావనను జేసి ప్రభాకర్ రెడ్డి విషయంలో చంద్రబాబు ఎందుకు తేవటం లేదని సోము నిలదీశాడు. అసలు నేరాలకు కులానికి సంబంధమే లేదని కూడా సీనియర్ నేత తేల్చేశాడు. నేరాలు చేసిన వారిని కులాలతో లింకు పెట్టి మాట్లాడటంతోనే చంద్రబాబు అవివేకం బయటపడిందని సోము ఫుల్లుగా ఫైర్ అయ్యాడు. ఒక్కసారిగా చంద్రబాబుపై సోము ఇంతగా ఫైర్ అయిపోవటం ఆశ్చర్యంగానే ఉంది.