Idream media
Idream media
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌తో కలసి తాడేపల్లి నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకంటూ 63 రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి తీసుకున్నారు. 25వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖకు అక్కడ నుంచి సాయంత్రం రోడ్డు మార్గాన తాడేపల్లికి చేరుకునేందుకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారు.
అయితే 25వ తేదీన విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన తన కుమారుడు లోకేష్‌తో కలసి రోడ్డు మార్గాన తాడేపల్లి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు మార్గమధ్యలోనూ, తాడేపల్లిలోనూ ఘన స్వాగతం పలికారు. 25వ తేదీన తాడేపల్లి చేరుకున్న చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 27, 28 తేదీల్లో మహానాడు జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. నిన్న గురువారం సాయంత్రంతో మహానాడు ముగిసింది. దీంతో చంద్రబాబు, తన కుమారుడు లోకేష్‌తో కలసి ఈ రోజు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. విశాఖ బాధితులను ఎప్పుడు పరామర్శించేది తెలియాల్సి ఉంది.