మోడీని ఎందుకు క్షమాపణ అడగాలి..? బాబు తప్పు చేశాడా..?

38 ఏళ్ల వయస్సును రాజకీయ పార్టీ, 42 ఏళ్ల రాజకీయ అనుభవంతో దేశంలోనే సీనియర్‌ రాజకీయ వేత్త అని చెప్పుకునే నాయకుడు ఉన్న పార్టీ, మా బలం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే అని చెప్పుకునే పార్టీ పని, ఆ నాయకుడి సత్తా అయిపోనట్లు ఆ పార్టీనేతలు గుర్తించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు, కార్యకర్తల సంక్షోభం నుంచి బయటపడేందుకు మోదీనే దిక్కు అని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు నిర్ణయానికి వచ్చారు. వారు రావడమే కాదు.. చంద్రబాబు నాయుడు మోడీతో ప్రత్యేకంగా సమావేశం కావాలని కోరుతున్నారు. వెళ్లి మాట్లాడితే చంద్రబాబును మోడీ క్షమించరాని పరిస్థితి ఉండదని నేరుగా బాబుకే సలహాలు ఇస్తున్నారు.

మహానాడు ముగింపు రోజున సీనియర్‌ నాయకుడు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ జూమ్‌ లైవ్‌లో చంద్రబాబుకు ఈ సలహా ఇచ్చారు. ఏదో దురదృష్టం కొద్దీ మనకు, మోడీకి గ్యాప్‌ వచ్చిందని చంద్రబాబుకు చెబుతూ గత చరిత్రను మరిపించే ప్రయత్నం చేశారు. క్షమాపణలు అడిగితే మోడీ క్షమించరాని పరిస్థితి ఉండదంటూ చంద్రబాబు తప్పు చేశారని చెప్పకనే చెప్పారు.

2014 ఎన్నికల్లో మోడీతో పొత్తు పెట్టుకుని గెలిచిన చంద్రబాబు.. ఆ తర్వాత మోడీని ఆకాశానికెత్తాశారు. 2018 వరకూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ.. సందర్భం వచ్చినప్పుడల్లా మోదీనే దేశ ప్రధానిగా నిత్యం ఉండాలంటూ ఆకాశానికెత్తారు. మోడీ లాంటి ప్రధాని తన జీవితంలో మరెవరినీ చూడలేదంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

సీన్‌ కట్‌ చేస్తే 2019 ఎన్నికలకు ఏడాది ఉందనగా బీజేపీతో పొత్తు ఉంటే ఎన్నికల్లో గెలవలేమని భావించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగారు. ధర్మపోరాట దీక్షల్లో మోడీ లక్ష్యంగా అవాకులు చవాకులు పేలారు. అసలు మోడీ ఎవరంటూ..? అతనికి ఉన్న గుర్తింపు ఏమిటి అంటూ.. భార్య లేదు, కుటుంబం లేదు అంటూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. తనకు కుటుంబం, భార్య, కుమారుడు, కోడలు, మనవడు ఉన్నారంటూ.. మోడీకి ఎవరున్నారని ప్రశ్నించారు. ఇక తన బావమరిది బాలయ్య బాబుతో.. హిందీలో అనరాని మాటలు అనిపించారు.

ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని, బీజేపీని వ్యతిరేకిస్తే ఓట్లు పడతాయనుకున్న చంద్రబాబుకు ఆశాభంగమైంది. ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన మాదిరిగా ఘోర పరాభవం చవిచూశారు. తన పరిపాలనా దక్షత, సంక్షేమంలో దూకుడుతో ఉన్న సీఎం జగన్‌ దెబ్బకు.. ఏడాదికే చంద్రబాబు బేలమొహం వేశారు. ఏడాదిలో అత్యంత బాధాకరంగా సాగిందంటూ మహానాడులో వాపోయారు. ఓ పక్క నాయకులు, అదే సమయంలో కార్యకర్తలు కూడా జారీ పోతుండడంతో ఏమి చేయాలో పాలుపోవడంలేదు. ఈ నేపథ్యంలోనే జ్యోతుల నెహ్రూ చంద్రబాబుకు నేరుగా ఈ సలహా ఇచ్చారు. వెళ్లి మోడీని క్షమాపణలు అడగాలని సూచించారు. అప్పుడే ఈ సంక్షోభం నుంచి కోలుకోగలమన్నారు.

మోడీపై కత్తులు దూసిన చంద్రబాబుకు.. జ్యోతుల నెహ్రూ ఈ సలహా ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అందరి వద్దకూ తిరిగిన చంద్రబాబును, మోడీ కన్నా సీనియర్‌ అయిన వ్యక్తిని పట్టుకుని.. మోడీనే క్షమాపణలు కోరాలని నెహ్రూ చెప్పడంతో బాబు అభిమానులు షాకవుతున్నారు. పులి, సింహాలతో తమ నేతను పోల్చుకునే బాబు అభిమానులకు నెహ్రూ మాటలు ఏ మాత్రం మిగుడుపడడంలేదట.

Show comments