iDreamPost
iDreamPost
చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి అని చెప్పిన గంటల వ్యవదిలోనే తెలుగు తముళ్ళు లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తుంది. చంద్రబాబుకి పుట్టిన రోజు కానుక గా ప్రభుత్వం పై గోబెల్స్ ప్రచారానికి పూనుకున్నారు. ఇప్పటికే కరోనా నిర్ధారణ పరీక్షల్లో రోజుకు 17,500 మందికి పరీక్షలు చేసి, దేశంలోనే 2వ స్థానంలో ఉన్న కేరళను వెనక్కి నెట్టి ఆంద్రప్రదేశ్ ఆ స్థానం కి ఎగబాకటంతో మొన్నటివరకు రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరగడంలేదు అని గగ్గోలు పెట్టిన తెలుగుదేశానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. దీంతో బురదజల్లడంలో పందా మార్చి కొరియా నుండి రాష్ట్రం కొనుగోలు చేసిన కరోనా టెస్టింగ్ కిట్లలో భారీ అవినీతి జరిగిందని లోకేష్ కనుసన్నల్లో నడిచే తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్ (ICMR) చేత ఆమొదం పొందిన SD BIOSENSOR, Inc.అనే దక్షిణ కొరియా కు చెందిన కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టెస్టింగ్ కిట్లను కొనుగోలు చెసింది. ఈ నెల 17వ తారీకున ప్రత్యేకంగా చార్టెర్డ్ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్ నగరం నుంచి ఒక్కసారే లక్ష టెస్టింగ్ కిట్లను తెప్పించింది. ఇంత పెద్దయెత్తున దిగుమతి చేయడం దేశంలో ఇదే తొలి సారి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ ర్యాపిడ్ కిట్లు కేవలం 10 నిమషాల వ్యవదిలో వైరస్ ఉన్నది లేనిది చూపిస్తుంది. ఈ ర్యాపిడ్ కిట్ల సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు చేసి వ్యాది గ్రస్తులను అత్యంత వేగంగా గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ముందు వరసలోకి రాబోతూ వుంది .లక్ష కిట్ల కొనుగోలు చేసినందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందు వరసలో ఉన్న ఈ తరుణంలో ప్రభుత్వ పనితీరుకు వస్తున్న ప్రశంసలను జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ ఈ విపత్కర సమయంలో కూడా విష ప్రచారానికి తెరలేపింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ ర్యాపిడ్ కిట్లలో భారీ అవినీతి జరిగిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కిట్టును 730 రూపాయలకు కొంటే అదే దక్షిణ కొరియా కంపెనీ నుంచి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఒక్కో కిట్ ను 337 కే కొన్నదని , ఇది భారీ స్కాం అని గగ్గోలు పెడుతున్నారు. కొనుగోలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏమి నిబందనలు పెట్టి ఆ సంస్థ దగ్గర కొనుగోలు చేసిందో పర్చేజ్ ఆర్డర్లో(PO) స్పష్టంగా ఉన్న విషయం తెలిసినా ఇలా ఆరోపణలు చేయడం తెలుగుదేశం బురదజల్లే రాజకీయానికి పరాకాష్ట.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చెసే ముందే పర్చెజ్ ఆర్డర్ లో ఏదైనా రాష్ట్రానికి అంతకన్నా తక్కువ ధరకు కిట్లు విక్రయిస్తే తాము అదే ధర చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిబందనలు పెట్టింది. అలాగే 3ఏళ్ళు సదరు కంపెనీను బ్లాక్ లిస్ట్ లో పెడతాం అని హెచ్చరించింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలులో ఇంత పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే పర్చేజ్ ఆర్డర్లో ప్రభుత్వం పెట్టిన క్లాజ్ ని ఉద్దేశ పూర్వకంగా విస్మరించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తెలుగుదేశం చేస్తున్న విషప్రచారం శోచనీయం.
అదీకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న టెస్టింగ్ కిట్ కి , ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న టెస్టింగ్ కిట్ కి మద్య వ్యత్యాసం ఉందనే వాదన ఉంది. మన రాష్ట్రం కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్ పరీక్షా ఫలితం 10 నిమషాల్లో వస్తే ఛత్తీస్ ఘడ్ కొనుగోలు చేస్తున్న టెస్టింగ్ కిట్ పరీక్షా ఫలితం 30 నిమషాల్లో వస్తుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఛత్తీస్ ఘడ్ కు చెందిన అంబెద్కర్ హాస్పిటల్ మైక్రో బయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ అరవింద్ నెరాల్ కూడా స్పష్టం చేశారు. ఒక వస్తువు ఒకే కంపెనీ నుండి కొన్నా దానీలో ఉన్న స్పెసిఫికేషన్స్ బట్టి ధరల్లో మార్పు ఉండటం సహజమే.
ఇక తెలుగుదేశానికి వంత పాడుతున్న రాష్ట్ర భారతీయ జనతా పార్టి నేత కన్నా లక్ష్మీ నారయణ సైతం తెలుగుదేశం సోషల్ మీడియా పోస్ట్ కి వత్తాసు పలుకుతూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ప్రభుత్వం టెస్టింగ్ కిట్ల కొనుగోలులో అవినీతి చేసిందని ముందు వెనక ఆలోచించకుండా పోస్ట్ చేసి నవ్వుల పాలయ్యారు. ఎందుకంటే అదే కిట్లను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక రోజు తరువాత ఒక్కో కిట్టుకు 65 రూపాయలు ఎక్కువ వెచ్చించి 795 రూపాయల చొప్పున కేంద్రం కొన్నది. ఈ విషయం తెలియని కన్నా ప్రభుత్వం పై బురద జల్లాలనే ఆత్రుత ప్రదర్శించి నవ్వులపాలయ్యారు.
పర్చేజ్ ఆర్డర్ దగ్గరనుండి కొనుగోలు వరకు అత్యంత పారదర్శకంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం పై ఈ విపత్కర సమయంలో కూడా అడ్డగోలు ఆరోపణలు చేయడం తెలుగుదేశానికే చెల్లింది. నేడు దేశం ఏ పరిస్థితుల్లో ఉందో ఎంత కష్ట కాలాన్ని ఎదుర్కుంటుందో కనీస స్పృహ లేకుండా రాజకీయమే పరమావదిగా తెలుగుదేశం చేసే ఈ హేయమైన రాజకీయం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందు వరసలో ఉన్నప్పుడు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అభినందించాల్సిందిపోయి చంద్రబాబు నాయుడు వారి సోషల్ మీడియా టీం ద్వారా ఇలా దుష్ప్రచారం చేయడం అత్యంత హేయమైన చర్య.