Idream media
Idream media
కరోనా కట్టడిలో ఏపీ అవలంబిస్తున్న విధానాలను దేశమంతా భేష్ అని మెచ్చుకుంటుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు, అద్భుతమైన పనితీరులోనూ సత్తా చాటుతోంది అంటూ రాష్ట్ర పోలీస్ శాఖ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. అందుకు నిదర్శనం జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 108 అవార్డులను పొందడమే అని కొనియాడింది. చంద్రబాబు మాత్రం ఏపీ పోలీసులు కేసుల చేధనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఏదో కారణాలు చెప్పి పోలీసులపైనే కేసులు పెట్టండి.. దెబ్బకు దారికొస్తారని కార్యకర్తలను ఉసిగొల్పుతున్న ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ పరిశీలిస్తే 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబు ఇలాంటి చీఫ్ పాలిట్రిక్స్ కూడా చేస్తారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా మరో లేఖ…
ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని పోలీసులపై చూపుతూ చంద్రబాబు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే చాలా లేఖలు రాశారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుపై ఉన్న గౌరవంతో పోలీసులు పలు మార్లు వాటిని గౌరవప్రదమైన సమాధానాలు చెప్పేవారు. ఓ సందర్భంలో శ్రుతిమించడంతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కూడా గట్టిగానే బదులిచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. తాజాగా డీజీపీ గౌతం సవాంగ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 600 మందికి పైగా టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీడీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అణచివేత విచ్చలవిడిగా సాగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రాథమిక హక్కులు అణిచివేతపై కొందరు పోలీసులు శ్రద్ధ చూపుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పార్టీతో కుమ్మక్కవటం బాధాకరం.
అసమ్మతి ప్రజాస్వామ్మానికి రక్షణ కవచం. టీడీపీ నేతలకు జారీ చేసిన నోటీసులే ఇందుకు నిదర్శనం. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదని నోటీసుల్లో పేర్కొన్నారు. అసమ్మతిని అణిచివేసే బదులు శాంతిభ్రతల పరిరక్షణపై దృష్టి పెట్టాలి. అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణం’ అని లేఖలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేశారు. తప్పు చేసినా, చట్టాన్ని ఉల్లంఘించినా వారు ఏ పార్టీ వారైనా పోలీసులు నోటీసులు ఇవ్వడం సాధారణమే. వారి కర్తవ్యం వారు నిర్వహిస్తుంటే చంద్రబాబు ఇలా లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై కూడా సమాధానం ఇవ్వడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది.
ఇలాంటి రాజకీయాలు తగునా సారూ…
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను ఎగదోస్తున్న బాబు వ్యవహారం బయటపడింది. టీడీపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమావేశమైన ఆయన కేసులు పెట్టి పోలీసులను భయపెట్టండంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై ఐదారు కేసులు పెడితే.. వాళ్లే కాళ్ల బేరానికి వస్తారని చంద్రబాబు చెప్తున్న ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టెక్నాలజీని వాడుకుని ఆన్‌లైన్ ద్వారా కేసులు పెట్టాలని… టీడీపీ కార్యకర్తలను బాబు రెచ్చగొట్టారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది విన్నవారు చంద్రబాబు లాంటి వ్యక్తికి ఇటువంటి రాజకీయాలు తగునా అని విమర్శిస్తున్నారు.