నా కులం కోసం రాజధాని కాదు– అమరావతి గ్రామాల్లో చంద్రబాబు

తన కోసం, కొంతమంది కోసమే రాజధాని కాదని, రాష్ట్ర ప్రజలందరి కోసమని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఎర్రబాలెంలో అమరావతి ప్రాంతవాసుల నిరసనకు చంద్రబాబు, ఆయన సతీమని భువనేశ్వరి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే…

’’ రాష్ట్రం విడిపోయింది. సంపద సృష్టించాలంటే నగరాలు రావాలి. ఆదాయం రావాలి. ఆ రోజు భూములు ఇవ్వడం రైతులకు ఇష్టం లేదు. నేను ఒక్క పిలిపు ఇచ్చాను. నన్ను నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానిలో భూమి ఇస్తామంటే గన్నవరం ఎయిర్‌పోర్టు కోసం అక్కడ రైతులు 650 ఎకరాలు ఇచ్చారు.

తెలుగుజాతి కోసం హైదరాబాద్‌ నిర్మించాను కానీ నా కోసం, నా కులం కోసం కాదు. అలాగే అమరావతి కూడా. ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా..? అసలు మూడు రాజధానులు పెట్టే అధికారం వీరికి ఎవరిచ్చారు. వీరికి ఏ అధికారం ఉంది. జీఎన్‌ రావు ఓ పలికిమాలిన ఆఫీసరు. ఆయనతో ఓ కమిటీ వేశారు. బీసీజీ గ్రూపు పోర్చుగల్‌లో తప్పు చేస్తే వారిపై విచారణ చేస్తున్నారు. అదో పెద్ద కమిటీ. హైపవర్‌ కమిటీ అంట. అక్కడ అంతా మంత్రులు, దొంగలంతా కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. వీరా నిర్ణయించేది. వీరెవరు అని అడుగుతున్నా. అసలు వీరికి అధికారం ఏముందని అడుగుతున్నా.

ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అంట. నేనెప్పుడూ వినలేదు. రాజధాని ప్రకటించిన తర్వాత భూములు కొనకూడదా..? ఎవరూ కొనకపోతే రేట్లు ఎలా పెరుగుతాయి. కొంత మంది పూలింగ్‌కు ఇవ్వం, అమ్ముకుంటామంటే అనుమతి ఇచ్చాను. ఎకరం పదిలక్షల భూమి కోటికి అమ్ముకున్నారు. భూముల విలువ పెరిగితే జగన్‌కు ఎందుకు కడుపు మంట..? నాపై విచారణ అని భయపెడుతున్నారు. నేను భయపడను. విచారణ చేసుకోండని చెప్పాను.

నిన్న పవన్‌కల్యాణ్‌ వస్తే అడ్డుకున్నారు. సీఎం ఉంటే మరెవరూ నడవకూడదా..? పవన్‌ను అడ్డుకోవడానికి వీరికి ఏం అధికారం ఉంది. అతను పొలాల నుంచి మందడం వెళ్లారు. నువ్వు(జగన్‌) పాదయాత్ర చేసేటప్పుడు నేను ముళ్లకంచె పెట్టుంటే తిరిగేవాడివా..? ఆ రోజు నేను సెక్యూరిటీ ఇవ్వకపోతే రాష్ట్రమంతా తిరిగేవాడివా. దేవుడి ఊరేగింపు జరుగుతుంటే ఆపి సీఎం వెళ్లారు. దేవుడి కంటే గొప్పాడా..? దేవుడి బిడ్డ కదా అందుకేనేమో దేవుడి ఊరేగింపు ఆపి వెళ్లారు.

విశాఖలో రౌడీలు ఉండకూడదనుకున్నారు. ఎంపీగా విజయమ్మ పోటీ చేస్తే పులివెందుల
నుంచి అడ్డు పంచెలు కట్టుకుని వచ్చారు. అందుకే ఓడించారు. సీఎంకు నీతి,నిజాయితీ లేదు కాని విశాఖ ప్రజలకు ఉంది. ప్రశాంతత ఉంటే రాజధాని కావాలని లేదంటే వద్దని విశాఖ ప్రజలంటున్నారు. మీకు న్యాయం చేయాలని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు. మీపై, నాపై కోపంతో ఈ ముఖ్యమంత్రి విశాఖను ఉద్దరిస్తారంట’’ అని చంద్రబాబు సీఎం జగన్‌ఫై మండిపడ్డారు. ప్రసంగం అనంతరం రాజధాని పోరాటానికి చంద్రబాబు విరాళాలు సేకరించారు.

Show comments