Idream media
Idream media
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించడంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మంగళవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ గాంధీ ప్రత్యక్ష విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత్‌లో సుమారు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ విఫలం కావడంతో దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు.
దేశంలో నాలుగు విడతలుగా విధించిన లాక్‌డౌన్ ప్రధాని మోదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే లాక్‌డౌన్ సడలించే మోదీ ప్రభుత్వ వ్యూహాలను కూడా రాహుల్ గాంధీ తప్పుపట్టాడు.వైరస్ విజృంభణ విపరీతంగా పెరుగుతున్న వేళ ప్రపంచంలో ఆంక్షల్ని ఎత్తివేస్తున్న దేశం భారత్ ఒక్కటేనని ఆయన ఎద్దేవా చేశారు.
దేశంలో కరోనా కేసులు తగ్గాయని ప్రధాని మోదీ,అతని సలహా సిబ్బంది ప్రచారం చేసినప్పటికీ, వాస్తవానికి ఇది సత్య దూరంగా నిలిచిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. భారత్‌లో సోమవారం రోజున దాదాపు 7000 కొత్త కేసులు నమోదయ్యాయని, ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. మంగళవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.45 లక్షలను దాటిందని, వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4167 కి చేరిందని పేర్కొన్నారు.
ఇప్పుడు లాక్‌డౌన్ విఫలమవ్వడంతో మోదీ ప్రభుత్వ వ్యూహం ఏంటో మనమంతా తెలుసుకోవాలి.కరోనా నియంత్రణకు కేంద్రం అమలు చేయనున్న ‘ప్లాన్ బి’ ని బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కరోనా సంక్షోభంలో పేద ప్రజల మనుగడ కోసం వారికి ప్రత్యక్ష నగదును అందిస్తున్నాము. కానీ ఆయా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడం లేదు.ఇప్పుడు కేంద్ర సహాయం లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు, వలసదారులకు మద్దతు ఇస్తునప్పటికీ, మన రాష్ట్రాలకు కేంద్రం నుంచి మాత్రం మద్దతు లభించడం లేదని రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంకా భారత్‌లో రెండో విడత కరోనా విజృంభిస్తే దాని పరిణామాలు ఇంతకన్నా తీవ్ర స్థాయిలో ఉంటాయని రాహుల్ వ్యాఖ్యానించారు.