విజయసాయి రెడ్డి అడిగారు.. కేంద్రం చేసింది..

రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆయన అడిగిన పనిని చేసిపెట్టింది. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సమయంలోనే వైఎస్సార్‌సీపీ ఎంపీ అడిగిన కీలకమైన పనిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయడం విశేషం.

ఇంతకూ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని ఏం అడిగారంటే… తెలుగు రాష్ట్రాల సీబీఐ వ్యవహారాలను పర్యవేక్షించే సీబీఐ హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ)గా తెలుగేతరులను నియమించాలని విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు ఈ నెల 11వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లోని సీబీఐ జేడీగా నియమించాలని విజయసాయి రెడ్డి తన లేఖలో కోరారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తినే నియమించాలని విన్నవించారు.

గతంలో సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మి నారాయణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ను ఇబ్బందులు పెట్టేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నాయుడు.. లక్ష్మి నారాయణకు ఆదేశాలు జారీ చేశారని లేఖలో పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌పై నమోదైన కేసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో చంద్రబాబు ల్యాండ్‌ ౖలñ న్‌ ఫోన్‌ ద్వారా లక్ష్మినారాయణతో పలుమార్లు మాట్లాడారని అందులో వివరించారు. లక్ష్మి నారాయణ టీడీపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారని, టీడీపీతో వ్యూహాత్మక భాగస్వామైన జనసేన తరఫున విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ సీబీఐ జేడీగా ఉన్న కృష్ణ సైతం తెలుగు వ్యక్తి అని, రాజకీయాలతో ముడిపడి ఉన్న అధికారి అని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టి చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారని, అంతేకాకుండా అవినీతి కేసుల నుంచి రక్షణ కోసం ఇలాంటి యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకనే తెలుగు రాష్ట్రాలతోనూ, రాజకీయాలతోనూ సంబంధం లేని అధికారిని సీబీఐ హైదరాబాద్‌ జేడీగా నియమించాలని విన్నవించారు.

విజయసాయి రెడ్డి వినతిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించారు. అమిత్‌ షా ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాలతోనూ, రాజకీయాలతోనూ సంబంధం లేని గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన మనోజ్‌ శశిధర్‌ను హైదరాబాద్‌ జేడీగా నియమిస్తూ నిన్న శుక్రవారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1994 గుజరాత్‌ ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన అధికారి అయిన శశిధర్‌ను నియమించడంతో విజయసాయి రెడ్డి వినతిని కేంద్ర పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్నట్లైంది.

Show comments