iDreamPost
android-app
ios-app

హైకోర్టుకు చేరిన బాబు వ్యవహారం.. ధర్మాసనం ఏం చేయబోతోంది..?

హైకోర్టుకు చేరిన బాబు వ్యవహారం.. ధర్మాసనం ఏం చేయబోతోంది..?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నిన్న సోమవారం హైదరాబాద్‌ నుంచి తాడేపల్లికి వచ్చే సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీగా జన సమీకరణతో స్వాగతాలు, తాడేపల్లిలో టీడీపీ శ్రేణులకు అభివాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ, వారిపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆ లేఖకు జత చేశారు. తమ లేఖ ఆధారంగా చంద్రబాబు లాక్‌డౌన్‌ ఉల్లంఘనను సుమోటోగా విచారణకు తీసుకోవాలని వారు విన్నవించారు.

లాక్‌డౌన్‌ వేల చేసేందుకు పనిలేక కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్న తమ నియోజకవర్గంలోని పేదలకు నిత్యవసరాలు, కూరగాయలు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు విడదల రజనీ, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఆర్‌.కె. రోజా, చేవిరెడ్డి భాష్కర్‌ రెడ్డిలపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వారికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో ప్రమాణ పత్రం దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రజా ప్రతినిధులే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడంపై తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోని హైకోర్టు.. వీరిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరాదంటూ ప్రశ్నించింది.

ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు.. వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. వారందరూ కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. కరోనా క్యారియర్లు అంటూ విమర్శించారు. అప్పుడు వైసీపీ నేతలపై విమర్శలు చేసిన చంద్రబాబే.. ఇప్పుడు తన స్వాగత సత్కారాల కోసం లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మేరుగ రాసిన లేఖలపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే హైకోర్టు వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు లాక్‌డౌన్‌ ఉల్లంఘనను సుమోటోగా హైకోర్టు విచారణకు తీసుకోకపోతే ఆ విమర్శలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏపీ హైకోర్టు వ్యవహారంపై ప్రజల్లో ఉన్న పలు అనుమానాలు బలపడే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం హైకోర్టుపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. దీనిని ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.