iDreamPost
iDreamPost
కరోనా వైరస్ సంక్షోభంలో రాజకీయాలు చేయకూడదని ఒకవైపు బుద్ధులు చెబుతునే మరోవైపు రాజకీయాలు చేయటం చంద్రబాబునాయుడుకే చెల్లింది. తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు చంద్రబాబు రాసిన లేఖలోనే రాజకీయమంతా బయటపడింది. పైగా తన లేఖలో ప్రస్తావించిన అంశాల్లో చాలా వరకూ అబద్ధాలనే చెప్పాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్టు చేశారంటూ గవర్నర్ కు లేఖలో ఫిర్యాదు చేశాడు. అరెస్టు ఎందుకు చేశారంటే రైతుల సమస్యల మీద మాట్లాడేందుకు కలెక్టర్ కు ఎంఎల్ఏ ఫోన్ చేశాడట. అయితే ఆ ఫోన్ కు కలెక్టర్ స్పందించకపోవటంతో నేరుగా కలిసి వినతపత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నం చేసినందుకు రామానాయుడును పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పాడు.
నిజానికి కలెక్టర్ ను కలవటానికి ఎంఎల్ఏ పాలకొల్లు నుండి ఏలూరుకు బయలుదేరింది కారులో కాదు సైకిల్ మీద. ఓ ఎంఎల్ఏ తన కారులో వెళుతుంటే పోలీసులు ఎక్కడా ఆపరు. అయితే రామానాయుడు మాత్రం రాజకీయంగా లబ్ది పొందే ఉద్దేశ్యంతో కావాలనే సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకోవటమే చంద్రబాబు ఉద్దేశ్యంలో అరెస్టు చేయటమా ?
గవర్నర్ కు రాసిన లేఖలోనే ఒకచోట అరెస్టు చేశారని మరో చోట భీమవరం దగ్గర ఆపి వెనక్కు పంపేశారని స్వయంగా చంద్రబాబే రాశాడు. తాను రాసిన లేఖలోనే వెనక్కు పంపేశారని అన్నపుడు ఇక అరెస్టు అంశమే ఉండదు కదా ? ఇక్కడే చంద్రబాబు రాజకీయం అర్ధం అయిపోతోంది. ఏదో రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లాలన్న ధ్యేయమే తప్ప మరోటి కనబడటం లేదు. మొత్తం మీద ప్రభుత్వం మొత్తం కరోనా సంక్షోభంపై దృష్టి పెడితే చంద్రబాబు మాత్రం ఫుల్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.