Idream media
Idream media
నా సలహాలు తీసుకోండి.. నా సలహాలు తీసుకోండి అంటూ మొన్నటిదాకా గొంతు చించుకున్న మాజీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కొంచం స్థిమిత పడ్డట్టు కనపడుతోంది. తాను రాసిన లేఖల వల్ల కొన్ని వర్గాలకు మేలు జరిగిందంటూ.. తన పార్టీ సమావేశంలో, తన పార్టీ నాయకులతో తీర్మానం చేయించుకొని ధన్యవాదాలు చెప్పించుకోని తన ప్రచార ఖండూతిని తీర్చుకుని సంతోషపడుతున్నారు.
హైదరాబాద్‌లోని ఇంట్లో నుంచి ఏపీలోని పార్టీ నేతలతో ఆన్‌లైన్‌లో జనరల్ బాడీ సమావేశంలో ఆయన మరోసారి తన గొప్పలు చెప్పుకుని మురిసిపోయారు. తాను లేఖలు రాయడం వల్లే రిటైర్డు ఉద్యోగులకు, పొగాకు రైతులకు, గుజరాత్‌లోని ఏపీ మత్స్యకారులకు, తమిళనాడు వలస కూలీలకు మేలు జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తనకు లేఖలు కూడా రాశాయని ఎవరికీ తెలియని ఓ గొప్ప రహస్యాన్ని కూడా చెప్పుకున్నారు. అయితే వాస్తవమేంటంటే సీఎం జగన్ చేస్తున్న కృషిని చంద్రబాబు ఏ మాత్రం మొహమాటం లేకుండా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రిటైర్డు ఉద్యోగుల సంఘాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం జగన్.. వారి పింఛన్లను పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు. ఇందుకు ఆయా సంఘాల నేతలు సీఎంకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అలాగే పొగాకు కొనుగోలు రాష్ట్ర పరిధిలోని అంశం కాదు. అయినప్పటికీ రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్ధేశంతో సీఎం జగన్ పొగాకు కొనుగోళ్లు మొదలుపెట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
ఇకపోతే గుజరాత్‌లోని ఏపీ మత్స్యకారులను తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో రెండు సార్లు మాట్లాడారు. అక్కడి ఏపీ వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అంతకుముందే ఏపీ నుంచి అధికారుల బృందాలను గుజరాత్‌కు పంపి నిత్యావసరాలు అందించారు. ఆ తర్వాత సముద్రమార్గంలోనైనా మత్స్యకారులను ఏపీకి తీసుకురావడానికి కేంద్రాన్ని కోరారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్‌షాలతోనూ చర్చించారు. అయితే సముద్ర మార్గంలో అయితే అనుమతుల కోసం ఆలస్యం అవుతుందని చెప్పడంతో రోడ్డు మార్గంలో తీసుకురావడానికి వేగంగా అనుమతులు వచ్చేలా చేశారు. 80 బస్సుల్లో మత్స్యకారులను విడతల వారీగా ఏపీకి తీసుకువస్తున్నారు.
సీఎం జగన్ ఇన్ని రకాలుగా కృషి చేస్తుంటే క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ పోటీ పడుతున్నారు. లేఖలతోనే పనిచేశానని చంద్రబాబు, ట్వీట్లతో కేంద్రాన్ని కదిలించానని పవన్‌కల్యాణ్ చెప్పుకుంటున్నారు. అయితే ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదనే విషయాన్ని వారిద్దరూ తెలుసుకుంటే మంచిది.