iDreamPost
iDreamPost
చంద్రబాబు పరిస్థితి రానురాను అగమ్యగోచరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన మాటల తీరుని బట్టి అలాంటి అనుమానమే వస్తోంది. అంతటి అనుభవజ్ఞుడు కూడా రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి భయాందోళనలు రేకెత్తించడం విస్మయకరంగా మారుతోంది. ప్రజలకోసం జీవితాన్ని అంకితం చేసానని చెప్పుకునే చంద్రబాబు చివరకు ఇంత కష్టకాలంలో కూడా టీడీపీ నేతలను సహాయక కార్యక్రమాలు చేపట్టాలని మాత్రం పిలుపునివ్వలేదు. పైగా నిరాహారదీక్షలు చేయండి, ఆందోళనలు చేయండి అంటూ పిలుపునిచ్చి ఆశ్చర్యపరిచారు.
రాజకీయంగా జగన్ పాలనలో ఉన్న రాష్ట్రం బాగుపడడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదనేది ఇప్పటికే స్పష్టమయ్యింది. కానీ ఇప్పుడు ఏకంగా మరింత దిగజారిపోవాలని ఆయన కోరకుంటున్నారా అనే అనుమానాలు కలిగే రీతిలో సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా మీడియా సమావేశంలో చంద్రబాబు మాటలున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుల వల్లే కరోనా వ్యాపించిందంట..అసలు అలాంటి మాటలు మాట్లాడేముందు కనీసం చంద్రబాబు ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. దేశంలోకి కరోనా వైరస్ రావడానికి అసలు కారణం విదేశాల నుంచి వచ్చిన వారేనని అంతా అంగీకరిస్తారు. ఆ తర్వాత దేశంలో విస్తృతం కావడానికి, ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి పలు కారణాలున్నాయి. కానీ వాటిని పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థిని విమర్శించడమే పని అన్నట్టుగా నోటికొచ్చింది మాట్లాడడం విడ్డూరంగా మారుతోంది.
శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్ల మీద ప్రజలందరికీ నిత్యావసరాలు పంపిణీ చేయడం బాబుకి సుతారమూ ఇష్టం లేనట్టుంది. తాను చేయని , చేయలేని పని మరోడు చేస్తే ఆయనకు గిట్టదు అన్నది లోకవిదితమే. ఇప్పుడు కూడా అలానే ఉంది. ప్రజలు పనుల్లేక అల్లాడుతుంటే వారిని కాపాడేందుకు బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేయడాన్ని బాబు, ఆయన బ్యాచ్ తప్పుబడుతున్నారు. అది మరింత జాగ్రత్తలతో చేసి ఉండాల్సిందని, విపక్ష నేతగా సూచనలు చేయడం వేరు..అలా చేస్తే అందరూ సమర్థిస్తారు. కానీ అందుకు భిన్నంగా ప్రజలకు సహాయం అందించడం వల్ల కరోనా వ్యాపిస్తుందని అనడం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతున్నారనే అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. ఆర్కే రోజా సహా అనేక మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కరోనా వేళ ఇంట్లో కూర్చోకుండా ప్రజల మధ్య సేవా కార్యక్రమాలతో సాగుతున్నారు. అలాంటి వారిని అభినందించడానికి బాబుకి మనసు అంగీకరించకపోయినా, ప్రతిఫలం పొందుతున్న ప్రజలు మాత్రం సేవలను గుర్తుంచుకుంటారనడంలో సందేహం లేదు.
అందుకు తోడుగా లాక్ డౌన్ ముగిసే నాటికి ఏపీలో 40వేల పాజిటివ్ కేసులు నమోదవుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో 750 కేసులు నమోదయితే అందులో 150 మంది వరకూ డిశ్ఛార్జ్ అయ్యారు. ఇక చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఇటలీ స్థాయిలో ఏపీలో కూడా కేసులు పెరగాలి. అలాంటి పరిస్థితి అసలు ఉందా అంటే ఇటలీలోనే కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన దశలో చంద్రబాబు హద్దులు దాటేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజల్లో ఆందోళన పెంచడం నాయకత్వ లక్షణం కాదు..వారిని భయపెట్టకుండా, అవగాహన కల్పించే పని చేయాల్సి ఉండగా బాబు తీరు పూర్తి విరుద్ధంగా ఉంది. పైగా అలాంటి పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తాయని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజల్లో కలవరం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒకరకంగా రాష్ట్ర ప్రజలను మరింత బెంబేలెత్తిపోయేలా చేసే ప్రయత్నమే తప్ప ఇంకేమీ కాదు.
చంద్రబాబు మాత్రం అన్నింటినీ వదిలేసి, తనకు ఏం తోస్తే అదే మాట్లాడే ఇలాంటి ధోరణి ఏపీకి ఏవిధంగానూ శ్రేయస్కరం కాదు. నిన్నటి వరకూ ఆయన పాలనలో ఉన్న రాష్ట్రంలో కేసులు పెద్ద సంఖ్యలో పెరగాలని ఆయన ఆశిస్తున్నట్టు అంచనాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ధోరణిని ప్రజలు సహించరు. కాబట్టి మీరు చెబుతున్నది మీకేమయినా అర్థమవుతోందో లేదో చూసుకోండి చంద్రబాబు గారూ..!