iDreamPost
android-app
ios-app

మేనకా గాంధీపై కేసు నమోదు: ఎందుకు..?

మేనకా గాంధీపై కేసు నమోదు: ఎందుకు..?

బిజెపి సీనియర్‌ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీపై కేసు నమోదైంది. ఎందుకంటే ఇటీవలి ఆమె కేరళలోని మలప్పురం జిల్లా ప్రజలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెపై కేసు నమోదు చేశారు.

కేరళలోని మలప్పురం జిల్లా, జిల్లా వాసులను కించపరిచే విధంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ మలప్పురానికి చెందిన సుభాష్‌ చంద్రన్‌ అనే అడ్వకేట్‌ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మే 29న జరిగిన ఏనుగు ఘటన పాలక్కడ్‌ జిల్లాలో చోటుచేసుకుందని, మలప్పురం జిల్లాలో కాదని ఆయన స్పష్టం చేశారు. ఏనుగు ఘటనకు కొంతమంది మతం రంగు పులుముతున్నారని ఆయన పేర్కొన్నారు. ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ మలప్పురం జిల్లాపై, జిల్లా వాసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

అయితే ఇటీవలి కేరళలో గర్భిణీ ఏనుగు మృతి తీవ్ర ఆవేదనను మిగిల్చింది. కొంత మంది ఆకతాయులు చేసిన దానికి ప్రతిఫలంగా జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, పర్యావరణ కాముకులు, జంతు పరిరక్షణ కార్యకర్తలు ఇలా అన్ని వర్గాల ప్రజలు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను, సానుభూతిని తెలిపారు. అయితే ఈ ఘటనకు మతం రంగు‌పులిమేందుకు కొంత మంది యత్నించారు. ఇదే అదునని మరికొంత మంది కేరళ పౌర సమాజం మొత్తాన్ని విమర్శించేస్తున్నారు.

ఈ ఘటనపై మేనకా గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘మలప్పురం జిల్లాలో జంతువులపై అమానుషంగా ప్రవర్తించే నేర ప్రవృత్తి ఎక్కువ. ఇప్పటి వరకు ఒక్క నేరస్తుడిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇలా అయితే వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు’’ అని పేర్కొన్నారు. దీనిపై మలప్పురంలోని న్యాయవాది సుభాష్ చంద్రన్ ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదైంది.

ఏనుగు మృతి ఘటనను కేరళ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే వారి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి కూడా కేరళ ఫారెస్టు విభాగం ప్రకటించింది.