iDreamPost
iDreamPost
గౌతమ్ వాసుదేవ మీనన్. సౌత్ సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. తీసుకునే కథలు చిన్నవే అయినా తనదైన శైలిలో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో మెప్పించేలా తీయడం ఈయన స్టైల్. అందుకే మొదటి సినిమా మిన్నాలే(తెలుగు చెలి)మొదలుకుని మొన్నటి తూటా దాకా దీన్ని గమనించవచ్చు. సాధారణంగా ఒక ఫార్ములా ప్రకారం వెళ్లిపోయే కమర్షియల్ సినిమాకు కొత్త గ్రామర్ ను నేర్పించిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం తర్వాత గౌతమ్ మీనన్ పేరే చెప్పొచ్చు.
సూర్యతో 2003లో తీసిన కాక కాక రేపిన సంచలనం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేనిది. పోలీస్ కథను ఎవరూ ఊహించని రీతిలో మలచడం చూసి క్రిటిక్స్ సైతం షాక్ తిన్నారు. వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ఏరికోరి మరీ తెలుగులో దీన్ని ఘర్షణగా రీమేక్ చేయించుకున్నాడంటేనే అతని టాలెంట్ ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత కమల్ హాసన్ తో చేసిన రాఘవన్ కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంది. 2008లో సూర్య కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ తీసిన సూర్య సన్ అఫ్ కృష్ణన్ ఇప్పటికీ అభిమానులు క్లాసిక్ గా భావిస్తారు. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా టార్గెట్ చేసిన ప్రేక్షకులకు ఇది నచ్చింది.
2010 సంవత్సరం తమిళ్ లో శింబుతో తెలుగులో నాగ చైతన్యతో చేసిన ఏ మాయ చేసావే ఇప్పటికీ మేజిక్ చేస్తూనే ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతానికి గౌతమ్ మీనన్ హృద్యమైన కథనం లవ్ స్టోరీస్ లో కొత్త ట్రెండ్ కి దారి చూపాయి. తర్వాత నాని సమంతాలతో చేసిన ఎటో వెళ్లిపోయింది మనసు మరో చక్కని దృశ్యకావ్యం. తర్వాత అజిత్ తో చేసిన ఎంతవాడుగాని, చైతు సాహసం శ్వాసగా సాగిపో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ పెద్ద రేంజ్ కు వెళ్ళలేదు. ఇటీవలే వచ్చిన ధనుష్ తో తూటా నిరాశ పరిచినా ఎప్పటినుంచోనిర్మాణంలో ఉన్న విక్రమ్ ధ్రువనక్షత్రం మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదే విలన్ గా తెరగేంట్రం చేయబోతున్న గౌతమ్ మీనన్ పుట్టినరోజంటే ఆయన సినిమాల జ్ఞాపకాల మీద అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతారు అభిమానులు.