iDreamPost
android-app
ios-app

రాజధానిలో ఇళ్ల స్థలాలకోసం హైకోర్టుని ఆశ్రయించిన మహిళలు

రాజధానిలో ఇళ్ల స్థలాలకోసం హైకోర్టుని ఆశ్రయించిన మహిళలు

రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలమైన తమకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన “పేదలందరికీ ఇళ్లు” పథకం కింద తమకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదని గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరికి చెందిన సుమారు 450 మంది మహిళలు హైకోర్టుని ఆశ్రయించారు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 53(1)(డీ) ప్రకారం రాజధాని ప్రాంతం మొత్తం ఏరియాలో 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వారు కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు విషయంలో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని అభ్యర్థిస్తూ 450 మంది మహిళలు హైకోర్టులో మంగళవారం వేర్వేరుగా రెండు ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయతలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం వల్ల తమలాంటి లక్షల మంది నిరుపేదలు లబ్ధి పొందుతారని వారు తమ పిటిషన్‌లలో పేర్కొన్నారు. తమకెవ్వరికీ ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో శాశ్వత నివాసాలు లేవని కోర్టుకి తెలిపారు.

రాజధాని చుట్టుపక్కల మండలాలకు చెందిన పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం గత నెల 25న 107 వ నంబర్ జీవో జారీచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం మంగళగిరి మండలానికి చెందిన 10,247 మంది ఇళ్ళు లేని నిరుపేదలకు మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో 250.48 ఎకరాల్లో ఇంటి స్థలాల పట్టాల మంజూరు చేస్తూ అధికారులు తుది జాబితా రూపొందించారు. అదేవిధంగా తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో నివసిస్తున్న 11,300 మంది ఇళ్లు లేని నిరుపేదలకు నవులూరులో 215 ఎకరాల్లో, కృష్ణాయపాలెంలో 37 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు.

ఈ మొత్తం వ్యవహారంలో తమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల కోర్ట్ వారు తుది ఉత్తర్వులు జారీ చేసేముందు తమ వాదన కూడా వినాలని సదరు పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో తమకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.