iDreamPost
android-app
ios-app

ఆంధ్రాను నిరాశపరిచిన బడ్జెట్

ఆంధ్రాను నిరాశపరిచిన బడ్జెట్

కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. కేంద్ర పన్నుల వాటానుండి ఏపీకి ఇవ్వాల్సిన నిధుల్లోనూ భారీగా కోత పడింది. 14 వ ఆర్థికసంఘం సిఫార్సులనూ పట్టించుకోలేదు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను 4.11శాతానికి తగ్గించింది.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వరుసగా ప్రతీ ఏడాది రెవెన్యూ లోటులో ఉంటున్న నేపథ్యంలో వచ్చే ఐదేళ్లపాటు కూడా రెవెన్యూ లోటులోనే ఉంటుందని, ఇందుకు గ్రాంటును సిఫార్సు చేయాలని 15వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు భర్తీ కింద రూ.5,897 కోట్లు మంజూరు చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. కానీ బడ్జెట్‌లో దీనికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్రం కోరినా అక్కడ కూడా నిరాశే మిగిలింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకపోగా.. ఈ బడ్జెట్‌లోనూ మొండిచెయ్యే చూపింది. అలాగే రాజధాని నిర్మాణానికి రూ.వెయ్యికోట్లు ఇస్తామని ప్రకటించినా ఆమొత్తాన్నీ బడ్జెట్‌లో పొందపర్చలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా ఆ విషయాన్నీ అస్సలు ప్రస్తావించలేదు. దుగరాజపట్నంకు బదులు రామాయపట్నం పోర్టు అభివృద్ధి, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ – చెన్నై కారిడార్, బెంగళూరు – చెన్నై కారిడార్లను కూడా కేంద్రం విస్మరించింది.

పునర్విభజన చట్టంలో పొందుపరిచిన జాతీయ విద్యా సంస్థలకు మాత్రం కేంద్రం అరకొరగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా.. కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఏపీ సెంట్రల్‌ వర్సిటీకి రూ.60.35 కోట్లు, గిరిజన విశ్వ విద్యాలయానికి రూ.26.90 కోట్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.31.82 కోట్లు కేటాయించారు. పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీలను ఎక్కడా ప్రస్తావించలేదు. విశాఖలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం.. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు, ఎయిమ్స్‌కు ఏవిధమైన కేటాయింపుల్లేవు.

ఈ బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో సాగుతోందని వ్యాఖ్యానించారు. హోదాపై గురించి ఎలాంటి హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణానికి చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్యాకేజీ రాలేదన్నారు.. హైదరాబాద్‌ నుంచి వచ్చేప్పుడు ఎన్నో వదులుకున్నామని, రాష్ట్రానికి చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయని ఈ విషయమ కేంద్రం వద్ద విన్నవిస్తూనే ఉన్నా ఫలితం లేదన్నారు.

రాబడి స్థూల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి స్థూల ఉత్పత్తి 10 శాతం అంటున్నారంటే అది కూడా ప్రశ్నార్థకంగా ఉందని బుగ్గన అన్నారు. గత బడ్జెట్‌లోనూ ఇలాగే చెప్పారని, కానీ అంచనాలన్నీ తప్పాయి అన్నారు. బడ్జెట్‌ పూర్తిగా ప్రశ్నార్థకంగా తయారైందని, జీఎస్టీ ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం వాటా ఇవ్వాల్సిందేనని ఏడెనిమిది రాష్ట్రాలకు తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటికీ రీయింబర్స్‌ చేయాలన్నారు. 2018–19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటా రూ.2,500 కోట్లకు తగ్గించారని, ఇది రాష్ట్రానికి పెద్ద దెబ్బని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే అప్పు శాతం తగ్గించడం మంచి పరిణామమని బుగ్గన అన్నారు. గోదాముల సామర్థ్యం పెంపు, ధాన్యలక్ష్మి, కిసాన్‌ రైలు ఏర్పాటును ప్రశంసించారు. ‘కృషి ఉడాన్‌’ ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమని, వెనుకబడిన జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణం, ఆయుష్మాన్‌ భారత్‌ నిర్ణయం మంచివన్నారు.

అలాగే ఈ బడ్జెట్‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పక్షనేత విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించిందని, వ్యవసాయ ఆధారిత రాష్ట్రాన్ని వివక్షతతో చూడడం మంచిది కాదని, ఈబడ్జెట్‌ నిరుత్సాహ పరిచిందన్నారు. రాష్ట్రానికి హోదా ఇస్తారని ఎదురుచూశామని, హోదాపై ప్రస్తావన లేకపోవడం, వెనుకబడిన 7 జిల్లాలకు రావాల్సిన రూ.24,350కోట్ల ప్రస్తావన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి సాధించుకుంటామన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదన్నారు. బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.