iDreamPost
iDreamPost
బిఆర్ శెట్టి వ్యాపార సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. దుబాయ్ కేంద్రంగా గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని యూరోపు దేశాల్లో కూడా వ్యాపార చక్రం తిప్పిన కర్నాటకకు చెందిన బిఆర్ శెట్టి వ్యాపారాలన్నీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. బిఆర్ఎస్ వ్యాపారాల్లో జరిగిన అక్రమాలపై చివరకు దర్యాప్తు చేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ) ని తప్పించుకుని ప్రాణభయంతో శెట్టి దుబాయ్ నుండి సొంతూరుకు పారిపోయి వచ్చాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కర్నాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన శెట్టి 1973లో అబుదాబిలో అడుగుపెట్టాడు. మెడికల్ రెప్రంజెంటేటివ్ గా జీవితాన్ని మొదలుపెట్టి మెల్లిగా ఫార్మా కంపెనీ స్ధాపించాడు. తర్వాత అంచలంచెలుగా ఎదుగి న్యూ మెడికల్ సర్వీస్ (ఎన్ఎంసి) పేరుతో చిన్న క్లినిక్, ఫార్మా కంపెనీని ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో దాన్నే అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్ళాడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు కష్టపడి ఎన్ఎంసిని మొత్తం గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా, లండన్ లాంటి అనేక దేశాల్లో విస్తరించాడు. ఎన్ఎంసి గ్రూపులో సుమారు 200 అతిపెద్ద హాస్పిటల్స్ నడుస్తున్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు శెట్టి ఎంత కష్టపడ్డాడో.
అయితే ఇంత కష్టపడిన శెట్టి చివరకు అడ్డదారులు తొక్కాడు. ఎన్ఎంసిలో ఇంగ్లాండ్ కు చెందిన మడ్డీ వాటర్స్ అనే పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సంస్ధ వాటాలు కొన్నది. కొంతకాలం తర్వాత కంపెనీ లెక్కలపై ఆరా తీయటం మొదలుపెట్టింది. ఎన్ఎంసి ఆస్తులు, వ్యాపార విలువ, మార్కెట్లో కంపెనీ షేర్ వాల్యు లాంటి వాటిపై మడ్డీ కంపెనీ దృష్టి పెట్టడంతో అసలు విషయం బయటపడింది. కంపెనీ ఆర్ధిక పరిస్ధితి, లాభాలు అంతా డొల్లేఅని బయటపడింది. కంపెనీ ఆడిటర్లు లేని లాభాలను ఎక్కువగా చేసి చూపారని, షేర్లను కూడా అధిక ధరలు వచ్చేట్లు చేశారనే విషయం బయటపడింది. ఇదే విషయాన్ని మడ్డీ వాటర్స్ బయటపెట్టింది. దాంతో లండన్ స్టాక్ ఎక్స్చేంజి ఎన్ఎంసి షేర్లపై బ్యాన్ విధించింది.
ఎప్పుడైతే ఎన్ఎంసి విషయం బయటపడిందో వెంటనే కంపెనీ షేర్ల ధరలు కుప్ప కూలిపోయి కంపెనీ విలువంతా పడిపోయింది. దాంతో ఆస్తులకన్నా అప్పులు ఎక్కువైపోయాయి. వెంటనే కంపెనీకి అప్పులిచ్చిన బ్యాంకులు వెంటపడటం మొదలయ్యింది. ఆస్తులు పడిపోయి, అప్పులు తీర్చలేక, కేసులు, విచారణ మొదలవ్వటంతో వెంటనే శెట్టి దుబాయ్ నుండి మాయమైపోయాడు. యూఏయి ప్రభుత్వం శెట్టి పై విచారణ జరుపుతున్న విషయాన్ని భారత్ ప్రభుత్వానికి కూడా తెలియజేసిందట. చంద్రబాబుతో అనుబంధం బిఆర్ఎస్ గా పాపులరైన శెట్టి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు.
చంద్రబాబు ఎప్పుడు దుబాయ్ వెళ్ళిన బిఆర్ఎస్ ఆతిధ్యాన్నీ తీసుకునేవాడు. బిఆర్ఎస్ కున్న ప్రైవేటు ఎయిర్ పోర్టులోనే చంద్రబాబు విమనాం దిగేదట. చంద్రబాబు తరపున ఎవరు దుబాయ్ వెళ్ళిన బిఆర్ఎస్ ను కలవందే తిరిగి వచ్చేవారు కాదని సమాచారం. చివరకు ఎన్ఎంసీ గ్రూపుకు అమరావతిలో చంద్రబాబు వంద ఎకరాలు కేటాయించటం విశేషం. టిడిపిలో బిఆర్ఎస్ గురించి ఒకపుడు చాలా గొప్పగా చెప్పుకునే వారు అలాంటిది ఇపుడు అరెస్టు వారెంట్ జారీ అవ్వటం, దర్యాప్తు కూడా జరుగుతుండటంతో పార్టీలో అసలు బిఆర్ఎస్ గురించి ప్రస్తావనే తేవటం లేదెవరు.
తనకే పాపం తెలీదట
ఇంత జరిగిన తర్వాత బిఆర్ఎస్ మాట్లాడుతూ తనకే పాపమూ తెలీదంటున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులే తన పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి తన సంతకాలను ఫోర్జరీ చేసినట్లు చెబుతున్నాడు. తన కంపెనీ ఆర్ధిక పరిస్ధితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ శెట్టి మండిపడుతున్నాడు.