iDreamPost
iDreamPost
కరోనా రాకపోయి ఉంటే ఈపాటికి సూర్య కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా విడుదలై ఉండేది. తమిళ్ లో సూరరై పొట్రు పేరుతో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. దానికి కారణం సూర్య తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నిర్మించిన పోన్మగళ్ వన్తాల్ ని నేరుగా ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ చేస్తామని ప్రకటించడమే. దీంతో ఆగ్రహం చెందిన తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఇకపై సూర్య నటించిన ఏ సినిమానూ థియేటర్లలో విడుదల కానివ్వబోమని అధికారిక ప్రకటన ఇవ్వడం వివాదాన్ని పెద్దది చేస్తోంది.
ఇప్పటిదాకా సూర్య తరఫున అతని నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఇంతే కాదు ఇకపై ఏ సినిమా అయినా 100 రోజుల తర్వాతే డిజిటిల్ రిలీజ్ చేస్తామని నిబంధనకు నిర్మాతలు కట్టుబడి ఉండాలని లేకపోతే వాటికి కూడా ఇదే బ్యాన్ సూత్రం వర్తిస్తుందని అల్టిమేటం జారీ చేయడం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ కు కూడా బ్రేక్ పడినట్టే. లాక్ డౌన్ తర్వాత ముందుగా విడుదల కావాల్సిన సినిమా ఇదే. ఆకాశం నీ హద్దురా పేరుతో ట్రైలర్ తో పాటు ఓ రెండు పాటలు కూడా రిలీజ్ చేశారు. కాని ఇప్పుడీ కాంట్రోవర్సి రావడంతో సందిగ్ధం నెలకొంది.
ఏకంగా సూర్య ప్రతి సినిమాను బ్యాన్ చేస్తామని పంపిణిదారులు పిలుపునివ్వడం పట్ల కోలీవుడ్ లో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మిమ్మల్ని గౌరవించి డిజిటల్ రిలీజ్ ఆపేసి సినిమాను మీకిస్తే కనీసం ఓ మూడు వారాలు ఆడిస్తామని గ్యారెంటీ ఇస్తారా అని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవ కార్తి ఖైది సినిమా నుంచే నలుగుతోంది. హాల్ లో బాగా ఆడుతున్న టైంలోనే ఖైదిని హాట్ స్టార్ లో రిలీజ్ చేయడం పట్ల ఎగ్జిబిటర్లు అప్పట్లోనే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది సూర్య తమ్ముడి సినిమా కావడం గమనార్హం. మొత్తానికి ఓటిటి వల్ల రేగిన చిచ్చు కార్పిచ్చులా మారే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది