మణిరత్నం మల్టీస్టారర్ కు బ్రేక్

ఒకటా రెండా కరోనా సృష్టించిన ప్రకంపనలు సినిమా పరిశ్రమను మాములుగా తాకలేదు. షూటింగులు ఆగిపోవడం థియేటర్లు మూతబడటం లాంటివే కాకుండా దీర్ఘకాలికంగా కూడా దీని ప్రభావం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ లతో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ని వెంటనే కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దిగ్గజ దర్శకులు మణిరత్నం రూపొందిస్తున్న మల్టీ స్టారర్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడింది. వెర్సటైల్ యాక్టర్స్ భారీ ఎత్తున నటిస్తున్న చారిత్రాత్మక యుద్ధ చిత్రం పొన్నియన్ సెల్వంని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు మణిరత్నం ఓ సోషల్ మీడియా లైవ్ ఈవెంట్ లో చెప్పారు.

చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శరత్ కుమార్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రభు, జయరాం, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ఇందులో నటిస్తున్నారు. నిర్మాణ దశ నుంచే దీని మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. సౌత్ తో పాటు నార్త్ నుంచి సైతం స్టార్స్ ని సెట్ చేసుకోవడంతో సినిమా ప్రేమికులు దీని కోసం ఎదురు చూస్తున్నారు. ఇది బాహుబలి తరహాలో రెండు భాగాలు ప్లాన్ చేశారు. థాయ్ ల్యాండ్ ఒక ముఖ్యమైన షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. వందలాది జూనియర్ ఆర్టిస్టులు, పెద్ద సెట్లు అవసరం ఉండటంతో నిబంధలతో కూడిన వాతావరణంలో పొన్నియన్ సెల్వం లాంటి మల్టీ స్టారర్లు తీయడం కష్టం.

అందుకే దీనికి బదులుగా సఖి తరహాలో ఒక లవ్ స్టోరీని రూపొందించే ప్లాన్ లో ఉన్నారు మణిరత్నం. తన రోజా, బొంబాయి హీరో అరవింద్ స్వామిని ఇప్పటికే ఒక కీలక పాత్ర కోసం సెట్ చేసుకున్నారట. స్క్రిప్ట్ పని పూర్తి కాగానే మిగిలిన క్యాస్టింగ్ ని ప్రకటిస్తారు. పొన్నియన్ సెల్వంకు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్ దీనికి కూడా మ్యూజిక్ ఇస్తారా లాంటి వివరాలు తెలియడం లేదు.ఏది ఏమైనా మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ కు ఇలా తాత్కాలిక బ్రేక్ పడటం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. గత కొనేళ్లుగా తన స్థాయిలో చిత్రం ఇవ్వలేకపోయింది మణిరత్నంకు పొన్నియన్ సెల్వం గట్టి బ్రేక్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. దీని కోసం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పేలా లేదు.

Show comments