Idream media
Idream media
ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మహారాష్ట్రకు కరోనా వైరస్ లాంటివారని బిజెపి ఎమ్మెల్సీ గోపిచంద్ పదల్కర్ మండిపడ్డారు. ఆయన చాలా సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నడిపించారని, అయితే బహుజన ప్రజలను మాత్రమే హింసించారని ఆరోపించారు. ఇకపై కూడా బహుజనుల విషయంలో ఆయన వ్యవహార శైలి ఇలాగే కొనసాగుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ధంగర్’ సమాజానికి రిజర్వేషన్లు ఇచ్చే వ్యవహరంలో కూడా ఆయన రాజకీయంగా చేస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో ధంగర్ సమాజానికి వెయ్యి కోట్ల ప్యాకేజీని ప్రకటించారని, ఉద్ధవ్ ప్రభుత్వం మాత్రం దానిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కరోనా కాలం ముగియగానే.. దీనిపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే గోపీచంద్ పదల్కర్ ఆరోపణలపై ఎన్సీపి స్పందిస్తూ…. ప్రతిపక్షంలోని ప్రతి నేత ఇలాంటి కామెంట్లే చేస్తుంటారని, వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కొట్టి పారేసింది. గోపీచంద్ వ్యాఖ్యలను ఎన్సీపి తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసే నేతలను బిజెపి సమర్థిస్తోందని దుయ్యబట్టింది.
అయితే ఎన్‌సిపి అధినేత, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్‌పై ‘‘కరోనా’’ వ్యాఖ్యలు చేసిన ఆరోపిస్తూ బిజెపి ఎమ్మెల్సీ గోపీచంద్ పడల్కర్‌పై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.
గోపీచంద్ పడల్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పుణే పోలీసులు నమోదు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లో పేర్కొన్నారు. మహారాష్ట్రకు సోకిన కరోనా వైరస్ శరద్ పవార్ అని వ్యాఖ్యానించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
గోపీచంద్ వివిధ వర్గాల మధ్య ద్వేషం, శత్రుత్వం పెంచే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భారత శిక్షా స్మృతి సెక్షన్ 505(2) ప్రకారం కేసు నమోదు చేశారు. బారామతి పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.