iDreamPost
iDreamPost
ఏపీ బీజేపీ వ్యవహారాలు ముదురుతున్నాయి. ముఖ్య నేతల మధ్య విబేధాలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. రాజకీయంగా బలపడాలని ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్న దశలోనే సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో బీజేపీ తీవ్రంగా సతమతం అవుతోంది. ముఖ్యంగా ఏపీ బీజేపీలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వైరం పెరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలతో కలిసి సుజనా చౌదరి వంటి వారు వేస్తున్న స్కెచ్ తో ఎంపీ జీవీఎల్ నరసింహరావుకి కూడా తలనొప్పులు తప్పడం లేదనే ప్రచారం ఊపందుకుంది.
ఇటీవల వైఎస్ జగన్ సర్కార్ పట్ల జీవీఎల్ సానుకూలంగా వ్యవహరిస్తున్నారని సుజనా వంటి వారు సందేహిస్తున్నారు. ఇప్పటికే అమరావతి వంటి విషయాల్లో సుజనాకి బహిరంగంగానే ఝలక్ ఇచ్చిన జీవీఎల్ తీరుని సహించలేని స్థితి కొందరిలో కనిపిస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వర్గాలు దానికి అనుగుణంగానే జీవీఎల్ మీద ఫిర్యాదుల పరంపర సాగిస్తున్నట్టు చెబుతున్నారు. ఏపీలో బీజేపీ బలపడే అవకాశాలను ఆయన నీరుగార్చేస్తున్నారని పలువురు నేతలతో ఫిర్యాదులు చేయిస్తున్న తీరుతో బీజేపీ అధిష్టానం కూడా కొంత అసహనంగా ఉన్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీని బలపరిచే బదులుగా ఇలాంటి విబేధాలతో పరువు తీసే కార్యక్రమాలు చేపడుతున్న విధానంతో బీజేపీ పెద్దలకు సమస్యగా మారుతున్నట్టు ప్రచారం మొదలయ్యింది.
Read Also:
ఎవరీ సునీల్ డియొధర్ ?
పవన్ కళ్యాణ్ విషయంలో కూడా జీవీఎల్ సమర్థవంతంగా పనిచేయలేకపోయారని బీజేపీ పెద్దలకు ఫిర్యాదులు చేరడంతోనే ఆయనకు బదులుగా వ్యవహారాన్ని సునీల్ దేవధర్ కి అప్పగించారని భావిస్తున్నారు. ఇప్పుడు బీజేపీలో పెత్తనం చెలాయించాలని చూస్తున్న జీవీఎల్ కి సునీల్ ద్వారా చెక్ పెట్టేందుకు ఓ వర్గం బీజేపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు కూడ తోడయినప్పటికీ సోము వీర్రాజు సహా పలువురు నేతలు మాత్రం జీవీఎల్ కి అండగా నిలుస్తుండడం కమలదళంలో కాక రాజుకోవడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అధిష్టానం ఆశిస్తుంటే పరిస్థితులు దానికి భిన్నంగా ఉండడంతో కాషాయశిబిరంలో కలకలం ఖాయంగా చెబుతున్నారు