iDreamPost
android-app
ios-app

బావా జనసేనకా.. బీజేపీకా..

  • Published Dec 20, 2020 | 1:15 AM Updated Updated Dec 20, 2020 | 1:15 AM
బావా జనసేనకా.. బీజేపీకా..

జనసేన.. బీజేపీ.. జనసేన.. బీజేపీ.. అని గొణుక్కుంటూ చేతిలో ఉన్న వేపాకులను ఒకొక్కటిగా తెంపి క్రిందపడేసుకుంటూ వస్తున్నాడు మణి.

దూరం నుంచే వీడి వాలకం గమనిస్తున్న కిట్టయ్య.. మళ్ళీ వీడేదో పట్టుకొచ్చేటున్నాడు అనుకున్నాడు మనస్సులో.

కిట్టయ్య దగ్గరకు వచ్చీ రావడం తోనే బావా.. తిరుపతి పార్లమెంటు సీటు జనసేనకిస్తారా? బీజేపీ పోటీ చేస్తుందా? అన్నాడు.

ఇది తెలియకేనేంట్రా ఇందాకట్నుంచి వేపాకులు పీకుతున్నావ్‌.. అన్నాడు కిట్టయ్య వెటకారంగా.

అదేం లేదు బావా ఈనెకు ఉన్న వేపాకుల్లో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ అనుకున్నాను.. చివరి ఆకు ఏ పార్టీదైతే మిగులుతుందో సీటు వారికే ఇస్తారనుకుని ఆ వేపాకులు పీకుతూ వస్తుంటే ఇంకా నాలుగు ఆకులు ఉండగానే మీ ఇల్లు వచ్చేసింది. అందుకే నిన్ను అడుగుతున్నాను అన్నాడు మణి.

జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్ళి తిరుపతి ఎన్నిక గురించి మాట్లాడ్డానికే వచ్చామంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఫలితం ఏంటన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

తీరా ఇక్కడేమో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజే అండ్‌ బృందమేమో తిరుపతిలో మేమే పోటీ చేస్తున్నామంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చేస్తున్నారు.

ఇప్పుడు ఈ ఇద్దరి వాలకం చూస్తుంటే సీటు ఎవరికి వస్తుందో ఇంకా కన్ఫర్మ్‌కానట్టే కదరా మణీ అంటూ వివరించాడు కిట్టయ్య.

అందుకే బావా అసలు చివరికి సీటు ఎవరికి వస్తుందన్నదే తేలడం లేదు బావా.. అందుకే ఈ టెన్షన్‌ అన్నాడు మణి.

అంత టెన్షన్‌ పడిపోయేంత ఏం లేదురా బాబూ అక్కడ అంటూ చెప్పడం మొదలెట్టాడు కిట్టయ్య. అప్పుడెప్పుడో పెట్టిన ప్రజారాజ్యం నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడం, నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేనకు కొన్ని ఓట్లు రావడం తమ బలంగా జనసేన భావిస్తోంది.

గతంలో బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందడం, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం తమ ప్లస్‌లుగా బీజేపీ వాళ్ళనుకుంటున్నారు. అందుకేరా తెగ పోటీపడిపోతున్నారు తిరుపతి ఎంపీ సీటు కోసం వీళ్ళిద్దరూను అంటూ ఆగాడు కిట్టయ్య.

నిజానికి తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నార్రా. ఒక్క తిరుపతి ఎమ్మెల్యేల స్థానం తప్పితే మిగిలన వన్నీ బంపర్‌ మెజార్టీతో 2010 ఎన్నికల్లో ఆ పార్టీ గెల్చుకొచ్చింది. ఎంపీగా గెలిచిన దుర్గాప్రసాదరావు కూడా రెండు లక్షలకుపైగానే మెజార్టీ తెచ్చుకున్నారు. దీని బట్టి బీజేపీ–జనసేనలు బలమైనవా, వైఎస్సార్‌సీపీ బలమైందో నీకే అర్ధమైపోతుందిరా మణీ అన్నాడు కిట్టయ్య.

అంతే కాదురోయ్‌ చివరాకరన్న ఈ బలాబలాలు బేరీజే వేసుకుని ఓడిపోయే ముప్పు ఉందనిపిస్తే బీజేపీ పెద్దలంతా కలిసి జనసేననే పోటీకి నిలుపుతార్రా అన్నాడు.

అంత ఖచ్చితంగా నెవ్వెలా చెబుతున్నావు బావా అన్నాడు మణి.

ఏం లేదురా ఎలాగూ పోతుందని తెలిసినప్పుడు అధికారంలో ఉన్న తమ పరువెందుకు పోగొట్టుకుంటార్రా బీజేపీ వాళ్ళు. అదేదో జనసేనే బలిపసువును చేస్తారు తప్ప అంటూ ముగించాడు కిట్టయ్య.

దీంతో చేతిలో ఉన్న వేపాకును క్రింద పడేసి ఇంటి దారి పట్టాడు మణి.