iDreamPost
iDreamPost
ఏపీ బీజేపీ వ్యవహారాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కమల దళంలో కొందరి తీరుతో చాలాకాలంగా ఓపికగా ఉన్న అధికార వైఎస్సార్సీపీ ఒక్కసారిగా విరుచుకుపడడం విశేషంగా మారింది. అందులోనూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మీద గురిపెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. స్వయంగా విజయసాయిరెడ్డి లీడ్ తీసుకుని ప్రారంభించిన దాడితో రాజకీయ పరిణామాల మీద పెద్ద చర్చ జరిగింది. చివరకు తాజాగా బీజేపీ అధిష్టానం జోక్యంతో వ్యవహారం సర్థుమణుగుతున్నట్టే కనిపిస్తోంది.
నాలుగైదు రోజులుగా సాగుతున్న రాజకీయ రచ్చ మీద బీజేపీలో భిన్నస్వరాలు వినిపించాయి. కన్నా తీరుని సొంత పార్టీలోని చాలామంది నేతలు సహించడం లేదు. విజయసాయిరెడ్డి ఆరోపణలుకు తగ్గట్టుగానే బీజేపీ అద్యక్షుడు వ్యవహరిస్తున్నారని అనేక మంది అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలకే కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనుమానిస్తున్నారు. బీజేపీ విధానాలను, అధిష్టానం ఆదేశాలను కాకుండా టీడీపీ కి మేలు చేసేందుకు తహతహలాడుతున్న తీరు మీద కీలక నేతలు కూడా కుతకుతలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డితో వివాదం విషయంలో కన్నా తీరుని తప్పుబడుతూ పలువురు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇక చాలించండి అంటూ కన్నాకి సంకేతాలు
వైఎస్సార్సీపీ నేతలతో వివాదం విషయంలో కన్నా ఇక నోటిని కట్టబెట్టాలని బీజేపీ అధిష్టానం సూటిగా ఆదేశించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యవహారంలో ఇది కీలక పరిణామంగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి తో ఛాలెంజ్ కి దిగిన కన్నాకి ఇది పెద్ద షాక్ గా భావిస్తున్నారు. నేరగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీన్ లోకి వచ్చి, వీడియో కాన్పరెన్స్ లో కన్నాకి తలంటినట్టు కనిపిస్తోంది. కరోనా సమయంలో హద్దులు మీరి రాజకీయ విమర్శలు చేయవద్దని ఆయన ఆదేశించడంతో కన్నా నోట్లో పచ్చి వెలక్కాయపడ్డట్టయ్యింది. పైగా ఆధారాలు ఉంటే తప్ప మాట్లాడవద్దని సూచిండంతో ఇప్పటివరకూ కన్నా చేసిన విమర్శలన్నీ నిరాధారంగా కనిపిస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు.
లోతైన అధ్యయనం లేకుండా విమర్శలు చేయవద్దని, అవి కూడా జాతీయ నాయకత్వం అనుమతితో మాత్రమే మాట్లాడాలని చెప్పడంతో ఏపీ కమలంలో ఓ వర్గానికి మింగుడుపడే అవకాశం కనిపించడం లేదు. ఏపీలో బీజేపీ స్వతంత్ర్య పక్షంగా వ్యవహరించాలని చెప్పడం ద్వారా చంద్రబాబు రాజకీయాలకు ప్రభావితం కావడం తగదని పరోక్షంగా హెచ్చరించినట్టు కనిపిస్తోంది. ఇకపై కన్నా గీత దాటకుండా కట్టడి చేసేందుకే నేరుగా జేపీ నడ్డా రంగంలో దిగినట్టు కనిపిస్తోందని పరిశీలకుల అభిప్రాయం. ఇప్పటికే ఏపీ బీజేపీలో కన్నా కంటే సీనియర్లు అనేకమంది ఉన్నప్పటికీ వారంతా కేంద్ర బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీతో గానీ, టీడీపీ తో గానీ సంబంధాలను ఆమేరకే నడుపుతున్నారు. కానీ కన్నా మాత్రం ఓ అడుగు ముందుకేయడంతో ఇప్పుడు లక్ష్మణరేఖ గీసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ అధికార పక్షం మీద విమర్శలు చేసేముందు ఆధారాలు కేంద్ర పెద్దలకు పంపిస్తే, పరిశీలించి చెబుతామని సూచించడం కీలకాంశంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఇప్పటికే చంద్రబాబు స్క్రిప్ట్ ని కన్నా అండ్ కో చదువుతున్నారని విమర్శలు మూటగట్టుకున్న తరుణంలో ఆయన్ని కట్టడి చేసేందుకు బీజేపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఏపీ రాజకీయాలను ప్రబావితం చేసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత వ్యూహాలకు బీజేపీ పెద్దలు చెక్ పెడుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. కరోనా సర్థుమణిగిన తర్వాత మరన్ని కీలక నిర్ణయాలు ఖాయమని భావిస్తున్నారు.