Idream media
Idream media
కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిలు వెలుగులోకి వచ్చారు. జనవరి 5వ తేదీ నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న భార్గవ్‌రామ్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఈ రోజు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు పోలీసులకు సరెండర్ అవడంతో ఈ కేసులో నిందితుల అరెస్ట్ పూర్తయినట్లైంది.
ఓ భూ వివాదంలో ఈ ఏడాది జనవరి 4వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువు, జాతీయ బ్యాడ్మింట్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, అతని సోదరులు నవీన్‌రావు, సునిల్‌రావులను భూమా అఖిల ప్రియ, భార్గవ్‌రామ్‌లు కిడ్నాప్ చేయించారు. కొంత మంది వారి ఇంటికి వెళ్లి ఐటీ అధికారులమంటూ వారిని వెంటబెట్టుకుని వెళ్లారు. వారి ల్యాప్‌ట్యాప్లు, సెల్‌ఫోన్లు, ఇతర పత్రాలు తీసుకెళ్లారు. హైదరాబాద్ శివార్లలోని ఓ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి వారి నుంచి సంతకాలు పెట్టించుకుని నార్సింగ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.
ఇంటికి వచ్చిన అనంతరం ప్రవీణ్‌రావు సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకుని విచారించగా.. ఈ కిడ్నాప్‌కు సూత్రదారులు భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లను తేలింది. వారిని నిందితులుగా చేర్చిన పోలీసులు, భూమా అఖిల ప్రియను జనవరి 5వ తేదీన అరెస్ట్ చేశారు. ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు పరారయ్యారు. పలుమార్లు పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత భూమా అఖిల ప్రియకు జనవరి 22వ తేదీన బెయిల్ లభించింది. భార్గవ్ రామ్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా.. హైకోర్టు వాటిని కొట్టివేసింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో భార్గవ్ రామ్ పోలీసులకు లొంగిపోయారు.