Bengal SSC Scam బెంగాల్ మంత్రి అరెస్ట్, మూడుసార్లు కాల్ చేసినా ప‌ట్టించుకోని మమతా

టీచర్ ఉద్యోగాల కుంభకోణంలో మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడలేదు. ప్రభుత్వం గానీ, తృణమూల్ కాంగ్రెస్ గానీ ఈ స్కాంతో తమకెలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ED అధికారులు అరెస్ట్ చేసిన వెంటనే పార్థ ఛటర్జీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయించారు. కానీ నాలుగుసార్లు ఫోన్ చేసినా ఆవిడ తీయలేదు. ఛటర్జీని మమత దూరం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో సరైన సమయంలో పార్టీ నుంచి ఒక ప్రకటన వెలువడుతుందని తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ తెలిపారు. ఈ కుంభకోణంలో ఇరుకున్న వాళ్ళెవరితోనూ తమ పార్టీకి “సంబంధం లేదని” ఆయన స్పష్టం చేశారు. అటు BJP మమత మౌనంపై విరుచుకుపడుతోంది. మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేనని పశ్చిమ బెంగాల్ బీజేపీ కో-ఇన్ ఛార్జ్ అమిత్ మాలవ్య ట్వీట్ చేశారు. అరెస్టైన మంత్రి మమతకు ఎంత సన్నిహితుడో అందరికీ తెలుసని, సంబంధం లేనట్లు వ్యవహరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

2014లో ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైమరీ, అసిస్టెంట్ టీచర్ల నియామకంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరపాలని హైకోర్టు CBIని ఆదేశించింది. ఈ కుంభకోణానికి సంబంధించి గత వారం పశ్చిమ బెంగాల్ లో 13 చోట్ల ఈడీ రెయిడ్లు జరిగాయి. మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలైన అర్పితా ఛటర్జీ ఇంట్లో జరిగిన సోదాల్లో ED అధికారులు 20 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అరెస్టైన పార్థ ఛటర్జీ అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ లో చేరారు. అన్ని పరీక్షలూ చేయించిన తర్వాత ED అధికారులు ఆయన్ను రెండు రోజుల రిమాండ్ కి తరలించారు.

Show comments