బంగారు బుల్లోడుతో నిప్పురవ్వ ఢీ – Nostalgia

మాములుగా ఒక పెద్ద హీరో సినిమా విడుదలవుతోందంటే ఆ రోజు ఎంత సందడిగా ఉంటుందో థియేటర్ల వద్ద తొక్కిసలాట ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది బాలకృష్ణ లాంటి స్టార్ నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు పోటాపోటీగా రిలీజ్ అయితే ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాలా. అలాంటి అరుదైన సంఘర్షణ 1993లో జరిగింది. ఆ విశేషాలు చూద్దాం. యువరత్న బ్యానర్ మీద విజయశాంతి ఒక భారీ బడ్జెట్ మూవీని తీయాలని నిర్ణయించుకున్నప్పుడు పరుచూరి సోదరులు నిప్పురవ్వ స్క్రిప్ట్ ని ఆవిడకు వినిపించారు. బాలయ్య అందులో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తి చూపించారు. అలా దానికి శ్రీకారం పడింది.

దర్శకుడిగా ఏ కోదండరామిరెడ్డిని తీసుకున్నారు. బప్పీలహరి పాటలు, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్వరపరిచారు. అమ్రిష్ పూరి, అల్లు, రావుగోపాల్ రావు, కన్నడ ప్రభాకర్, నిలగల్ రవి, లక్ష్మి, జయప్రకాశ్ రెడ్డి లాంటి భారీ క్యాస్టింగ్ సెట్ చేసుకున్నారు. ఏవో కారణాల వల్ల నిప్పురవ్వ బడ్జెట్ హద్దులు దాటిపోవడంతో పాటు బాలకృష్ణకు దీని మీద ఆసక్తి తగ్గిపోయి ప్రొడక్షన్ నుంచి తప్పుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. మూడేళ్ళకు పైగా నిర్మాణం జరిగిందని చెప్పుకునేవారు. మరోవైపు జగపతి బ్యానర్ లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడుని వేగంగా పూర్తి చేశారు బాలయ్య. రమ్యకృష్ణ, రవీనాటాండన్ హీరోయిన్లుగా పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. రాజ్ కోటి పాటలు ఆడియోలోనే సంచలనం సృష్టించాయి

అనూహ్యంగా రెండూ ఒకే రోజు తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిస్ట్రిబ్యూటర్లు ఎంత వేడుకున్నా ఎవరూ తగ్గలేదు. మాదంటే మాది పై చేయి అవుతుందని ఇద్దరు నిర్మాతలు పంతానికి పోవడంతో ఫైనల్ గా 1993 సెప్టెంబర్ 3న రెండు ఒకేరోజు థియేటర్లలోకి వచ్చాయి. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఉన్న మ్యూజికల్ హిట్ బంగారు బుల్లోడు ముందు అమితాబ్ కాలా పత్తర్ స్ఫూర్తిగా రూపొందిన సీరియస్ డ్రామా నిప్పురవ్వ నిలవలేకపోయింది. అయితే రెండు చిత్రాలు రాజమండ్రిలో స్ట్రెయిట్ 100 రోజులు ప్రదర్శింపబడటం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. తర్వాత బాలయ్య స్థాయి హీరో ఎవరూ ఇలా ఒకే రోజు రెండు సినిమాలతో రాలేదు. నాని ఎవడే సుబ్రహ్మణ్యం, జెండా పై కపిరాజుతో చేశాడు కానీ తన రేంజ్ అప్పుడు తక్కువ కాబట్టి పోలిక సరికాదు

Also Read : మహిళా చైతన్యానికి నిలువెత్తు ప్రతీక – Nostalgia

Show comments