iDreamPost
iDreamPost
స్టార్ హీరోతో సినిమాకు కావాల్సింది బడ్జెట్టో భారీ క్యాస్టింగో కాదు. హీరో ఇమేజ్ ఓపెనింగ్స్ వరకు పనికొస్తుందేమో కానీ లాంగ్ రన్ లో చిత్రం నిలబడాలంటే కంటెంట్ ముఖ్యం. దీన్ని చరిత్ర ఎన్నో సార్లు రుజువు చేసింది. చేస్తూనే ఉంది. ప్రేక్షకులను తక్కువ అంచనా వేసిన రోజు దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించక తప్పదు. 2004లో లక్ష్మి నరసింహ సక్సెస్ తర్వాత బాలకృష్ణను వరస పరాజయాలు పలకరించాయి. విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. అప్పుడు సోషల్ మీడియా తక్కువ కానీ లేదంటే ట్రోలింగ్ ఏ స్థాయిలో ఉండేదో. అప్పుడు ఎంటరయ్యారు దర్శకుడు వైవిఎస్ చౌదరి.
2006లో కొత్త హీరో రామ్ తో దేవదాసు రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన చౌదరి మంచి ఊపుమీదున్న టైం. స్వర్గీయ ఎన్టీఆర్ ని విపరీతంగా ఆరాధించే తను ఆయన వారసుడు బాలయ్యతో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా తీయాలనే సంకల్పంతో ఉన్నారు. అప్పటికే హరికృష్ణతో లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య రూపంలో రెండు హిట్లు ఖాతాలో ఉన్నాయి. పెద్దగా మార్కెట్ లేని ఆయనతో అంత ట్రాక్ రికార్డు సాధించినప్పుడు ఇక బాలకృష్ణను ఏ రేంజ్ లో చూపిస్తాడోనని అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టేసుకున్నారు. అప్పుడు ప్రకటించిందే ఒక్క మగాడు. అనుష్క, నిషా కొఠారి, సిమ్రాన్ లు హీరోయిన్లుగా తీసుకున్నారు.
మొదటిసారి వైవిఎస్ చౌదరితో సంగీత దర్శకుడు మణిశర్మ జట్టు కట్టారు. ఇంకేముంది హైప్ ఇంకాస్త పెరిగింది. బడ్జెట్ విషయంలో లెక్కలు వేయలేదు. విపరీతంగా ఖర్చు పెట్టేశారు. క్రేజ్ దృష్ట్యా బిజినెస్ కూడా హాట్ కేక్ లా జరిగిపోయింది. అన్ని ఏరియాలకు రికార్డు రేట్లకు కొనేశారు. 2008 జనవరి 10న ఆకాశమంత అంచనాల మధ్య రికార్డు ఓపెనింగ్స్ మధ్య రిలీజైన ఒక్క మగడు విపరీతంగా నిరాశపరిచింది. 1996లో వచ్చిన కమల్ హాసన్ భారతీయుడుని అటుఇటు తిప్పి బాలయ్యని డ్యూయల్ రోల్స్ లో చూపించిన తీరు ఫ్యాన్స్ కే నచ్చలేదు. దెబ్బకు మొదటివారంలోనే డెఫిషిట్ మొదలయ్యింది. నిర్మాతగానూ చౌదరిని గట్టి దెబ్బ కొట్టింది. పోటీకి వచ్చిన రవితేజ కృష్ణ అనూహ్య విజయం సాధించి ఆ ఏడాది సంక్రాంతి పండక్కు విజేతగా నిలిచి కాసుల వర్షం కురిపించుకుంది
Also Read: వర్షం వెనుక ఉన్న రెండు సినిమాలు – Nostalgia