వర్షం వెనుక ఉన్న రెండు సినిమాలు - Nostalgia

By iDream Post Jul. 25, 2021, 06:20 pm IST
వర్షం వెనుక ఉన్న రెండు సినిమాలు - Nostalgia

కొన్ని కథలకు యునివర్సల్ అప్పీల్ ఉంటుంది. అంటే టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు తీసినా మంచి ఫలితం దక్కుతుంది. దానికి భాషతో కూడా కనెక్షన్ అవసరం లేదు. దానికో మంచి ఉదాహరణ చూద్దాం. 1988లో అనిల్ కపూర్ హీరోగా ఎన్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన 'తేజాబ్' పెద్ద బ్లాక్ బస్టర్. మాధురి దీక్షిత్ ని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ని చేసింది. దేశం మొత్తం 'ఏక్ దో తీన్' పాట మారుమ్రోగిపోయింది. 50 వారాలకు పైగా ప్రదర్శింపబడి ఆ ఏడాది కొత్త రికార్డులు సృష్టించింది. 'మిస్టర్ ఇండియా'తో పాపులారిటీ పెరిగిన అనిల్ కపూర్ తేజాబ్ దెబ్బకు స్టార్ల లిస్టులోకి చేరిపోయారు. ఆ తరంలో మీసాలున్న స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

Also Read: సార్పట్ట ఒక అద్భుతం!

దీన్ని 1989లో వెంకటేష్ హీరోగా తెలుగులో 'టూ టౌన్ రౌడీ' పేరుతో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెంకట్ రాజు, శివరాజులు భారీ బడ్జెట్ తో సినిమా స్కోప్ లో రీమేక్ చేశారు. హిందీ వెర్షన్ లో మాధురి దీక్షిత్ పాత్రలో ఉన్న ఫ్రెష్ నెస్ ని ఇక్కడ సీనియర్ హీరోయిన్ అయిన రాధ రూపంలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఓపెనింగ్స్ భారీగా వచ్చినప్పటికీ లాంగ్ రన్ విషయంలో రౌడీ తడబడ్డాడు. రాజ్ కోటి పాటలు మ్యూజికల్ గా హిట్ అయ్యాయి. కృష్ణంరాజు, మోహన్ బాబు, నరేష్, చంద్రమోహన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ సైతం టూ టౌన్ రౌడీని పెద్ద స్థాయికి తీసుకెళ్లలేకపోయింది. ఫైనల్ గా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది

కట్ చేస్తే 15 ఏళ్ళ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన 'వర్షం' ఇదే లైన్ మీద రూపొందటం గమనార్హం. పూర్తి రీమేక్ కాకపోయినా వర్షంలో అసలు పాయింట్ మాత్రం తేజాబ్ నుంచి తీసుకున్నదే. ముఖ్యంగా హీరో హీరోయిన్ విలన్ పాత్రల మధ్య సంఘర్షణను దాదాపు అందులోదే వాడుకున్నారు. కాకపోతే ఇప్పటి తరానికి అనుగుణంగా రచయితలు పరుచూరి బ్రదర్స్, దర్శకుడు శోభన్ చేసిన మార్పులు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి వర్షంని బ్లాక్ బస్టర్ ని చేశాయి. ప్రభాస్ ని టాప్ రేంజ్ కి తీసుకెళ్లాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, గోపిచంద్ విలనీ ఏ స్థాయిలో పండాయో వేరే చెప్పాలా. ఇలా ఒకే కథతో ముగ్గురు స్టార్ హీరోలు అందుకున్న ఫలితాల కథ ఇది

Also Read: More Nostalgia Articles

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp