Idream media
Idream media
శుక్రవారం వస్తే వ్యాపారులు లక్ష్మీపూజ చేసుకుంటారు. భక్తి ఉన్న మహిళలు నోములు, వ్రతాలు చేసుకుంటారు. కానీ సినిమా సమీక్షకులకు మాత్రం గుండెల్లో రైళ్లు. ఈ వారం ఏ హీరో కుమ్ముతాడోనని.
ఈ సారి పందెం కోడిలా బాలయ్య రంగంలో ఉన్నాడు. మూడురోజుల ముందు నుంచే గుండె దడగా ఉంది. అసలే బాలయ్య, ఆపై రూలర్ అంటున్నారు. ఏం చేస్తాడో ఏమో!
బాలకృష్ణతో మనకున్న సౌకర్యం ఏమంటే ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో కూర్చుంటాం. బాగుంటే మన అదృష్టం. లేదంటే తలంటు. ఇంకో సౌలభ్యం ఏమంటే చాలా
ఏళ్లుగా ఆయన ఒకే యాక్టింగ్ చేస్తూ , ఒకటే సినిమా తీస్తున్నాడు. కథ ఒకటే, గడ్డాలు, మీసాలు మారుతాయి. ఆయనతో నటింపచేయాలని వెనుకటికి కే.విశ్వనాథ్, బాపు కూడా ప్రయత్నించారు. కానీ వాళ్ల వల్ల కూడా కాలేదు.
ట్రైలర్స్ చూస్తేనేమో దొరికినోన్ని దొరికనట్టు పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. పైగా వెంటాడి చంపుతానని బెదిరిస్తున్నాడు. ప్రకాశ్‌రాజ్ చూస్తే రైతులంటున్నాడు. తెలుగు కుటుంబాల కథ, ఎక్కడో నార్త్ ఇండియాలో జరుగుతున్నట్టుంది. మన బాలయ్య చూస్తే సింహంలా గర్జిస్తూ పోలీస్ డ్రెస్‌లో ఉన్నాడు. జయసుధ ఏమో అతని గతం నాకు అక్కర్లేదు అంటోంది.
ఏందిరా అయ్యా ఇది! అసలీ శుక్రవారం థియేటర్‌కు వెళ్లి మళ్లీ క్షేమంగా ఇంటికి వస్తానా లేదా!
కేఎస్ రవికుమార్‌కి ఇష్టమైన సినిమా బాషా. దాన్నే మళ్లీ మళ్లీ తీయడం కూడా ఆయనకు ఇష్టమే. ఈ సారి అదే చేశాడని ఎక్కడో అనుమానం.
ప్రతిరోజూ పండగ అని ఇంకో సినిమా ఉంది కానీ బాలకృష్ణ సినిమాలో రాయడానికి చాలా ఉంటుంది. గడ్డం పెట్టుకుని రకరకాల ఆయుధాలతో విజృంభిస్తూ ఉంటే చూడకపోతే తప్పిదం అవుతుంది. ఆయన చేతిలో గాయపడడం మన బాధ్యత. అభిమానులు అడిగి తన్నించుకుంటారు. ప్రేక్షకులు టికెట్ కొని మరీ తన్నించుకుంటారు. ఇక వేటే!
బాలయ్యను పట్టుకుని విలన్ “ఎవర్రా నువ్వు” అన్నాడంటే శుక్రవారం వాడు అయిపోయాడే!
ఆ ట్రైలర్ చూస్తే ముందుగానే కత్తులు ,ఇనుప రాడ్స్ సౌండ్స్ రికార్డు చేసి ఆ తర్వాతే సినిమా తీసినట్టున్నారు.
“ఇదేందయ్యా ఎప్పుడూ సూడ్లా” అని ప్రేక్షకులు అనేరోజు దగ్గర పడింది.