iDreamPost
iDreamPost
సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు దూరంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కి మరో ఘనత దక్కుతుంది. గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా సొంత రాష్ట్రానికి దూరంగా ఇంతకాలం గడిపిన దాఖలాలైతే లేవు. ఆ రకంగా టీడీపీ అధినేత ఘనత వహించాల్సిందే. అదే సమయంలో కరోనా మహమ్మారి కమ్ముకొచ్చిన వేళ రెండు నెలలకు ఆయన ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడం విశేషం అవుతోంది. అదే సమయంలో ఆయనకు అలాంటి అవకాశం కల్పించడం వెనుక జగన్ ప్రభుత్వ మెరుగైన పాలన ఉందని చెప్పక తప్పదు.
వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి సమీప రాష్ట్రాలు మహారాష్ట్ర లో గానీ, తమిళనాడు లేదా కర్నాటక లో గాని చంద్రబాబు కాలు పెట్టె అవకాశం లేదు. ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత రీత్యా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం వలస కూలీలకు అవకాశం ఇచ్చినప్పటికీ వారిపై కూడా ఆయా రాష్ట్రాల్లో పలు ఆంక్షలున్నాయి. వెళ్లిన తర్వాత అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ చంద్రబాబు కి అలాంటి పరిస్థితి రాకుండానే ఏపీలో సులువుగా అడుగుపెట్టారు. పైగా భౌతిక దూరం పాటించకుండా, నిబంధనలు ఉల్లంఘించారు.
అయినా ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ విషయంలో తీసుకున్న సమగ్ర కార్యాచరణ కారణంగా బాబుకి మళ్ళీ అమరావతి వైపు రావడానికి ఆస్కారం దక్కింది. పైగా అనుమతి కోరిన వెంటనే, గంటల వ్యవధిలో అవకాశం ఇచ్చారు. తద్వారా ఓ వైపు పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఆదర్శంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు, దేశాలు నుంచి వస్తున్న వారి విషయంలో కూడా అనుమతుల విషయంలో జాప్యం చేయడం లేదని స్పష్టం అవుతోంది.
చంద్రబాబు ప్రత్యక్షంగా అంగీకరించక పోయినా ఈ విషయంలో జగన్ కి కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ప్రచార ఆర్భాటం లేకుండా, అధికారులు నానా హైరానా పడకుండా, ఏ శాఖ సిబ్బంది, ఆయా పనులు సాగిస్తూ, ఎప్పటికప్పుడు సీఎం వాటిని సమన్వయం చేస్తూ కరోనా కట్టడి చేయడం సామాన్యం కాదు. పైగా ఇతర రాష్ట్రాల నుంచి చంద్రబాబు వంటి వారు మళ్ళీ ఏపీలో అడుగుపెట్టేందుకు అనుగుణంగా సిద్ధం చేసిన తీరు చిన్న విషయం కాదు. సమీప రాష్ట్రాల్లో ఇంకా ఆంక్షలు ఉండగానే ఏపీలో బాబు రాక దానికి నిదర్శనం గా నిలుస్తుంది.