అల…వైకుంఠ‌పురం అనుకున్నంత లేదు

పుట్ట‌గానే మ‌నం ఎందుకు ఏడుస్తామంటే, ఈ మూర్ఖుల‌ లోకంలోకి వ‌స్తున్నామ‌న్నాబాధ‌తో! -ఇది షేక్‌స్పియ‌ర్ కొటేష‌న్‌. ఒక పిల్లాడు పుట్ట‌గానే ఏడిస్తే “అల…వైకుంఠ‌పురంలో” సినిమా క‌థే లేదు. ఏడ్వాల్సిన టైంలో ఏడ్వ‌క‌పోవ‌డంతో ఇంత క‌థ న‌డిచింది. మ‌రి న‌వ్వించాడా అంటే ఆ ప‌ని ప‌ర్‌ఫెక్ట్‌గా చేస్తే ఇదంతా ఎందుకు రాయ‌డం?

మ‌హాభారతంలో చ‌క్ర‌వ‌ర్తిగా , పాండ‌వ‌ అగ్ర‌జుడిగా పెర‌గాల్సిన క‌ర్ణుడు ఎక్క‌డో మారుమూల రాధేయుడిగా జీవిస్తాడు. ర‌థాల్ని తోలుకునే వ్య‌క్తి అత‌న్ని పెంచుతాడు. ఈ అంశంతో క‌ట‌క‌టాల రుద్ర‌య్య (1978) , ద‌ళ‌ప‌తి (1991) వ‌చ్చాయి. ఇవి ప్ర‌ధానంగా త‌ల్లీకొడుకుల ఎమోష‌న్ సినిమాలు.

ఒక చోట పెర‌గాల్సిన వాళ్లు ఇంకోచోట పెరిగితే ఏమ‌వుతుంద‌నే ఆలోచ‌న షేక్‌స్పియ‌ర్‌ని కూడా వెంటాడింది. ఒకే పోలిక‌ల వాళ్లు తారుమారు, ఇదో హిట్ జాన‌ర్. మార్క్‌ట్వెయిన్ కింగ్ అండ్ పాప‌ర్ దీనికి మూల బిందువు (రాజు -పేద‌గా 1954లో వ‌చ్చింది).

ఏక‌కాలంలో పుట్టిన పిల్ల‌ల్లో ఒక‌రు పేద‌వాడు, ఇంకొక‌రు డ‌బ్బున్న వాడు. పేద‌వాడి తండ్రికి , త‌న కొడుకు డ‌బ్బున్న ఇంట్లో పెర‌గాల‌ని ఆశ పుట్టింది. మంత్రసాని సాయంతో పిల్ల‌ల్ని మార్చేశాడు. 1958లో వేదాంతం రాఘ‌వ‌య్య‌కి ఈ ఐడియా వ‌చ్చి ఇంటిగుట్టు అనే సినిమా తీశాడు.

1973లో దేవుడు చేసిన మ‌నుషులు వ‌చ్చింది. చిన్న‌ప్పుడే త‌ప్పి పోయిన ఎన్టీఆర్‌, సొంత ఇంటికే ఉద్యోగిగా వ‌చ్చి త‌న వాళ్ల‌ని గుర్తు ప‌ట్టి, ఇంటిని చ‌క్క‌దిద్దుతాడు. త‌మాషా ఏమంటే అదే సంవ‌త్స‌రం నాగేశ్వ‌ర‌రావుతో క‌న్న‌కొడుకు అనే సినిమా వ‌చ్చింది. సొంత ఇంట్లోనే హీరో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తాడు. ఈ విష‌యం త‌ల్లికి తెలుసు కానీ కొడుకుకి తెలియ‌దు.

మ‌నుషుల ఎమోష‌న్స్‌, సుఖ‌దుక్కాలు ఏ కాలంలోనైనా ఒక‌టే. రామాయ‌ణ భార‌త కాలాల్లో కూడా ఏడిస్తే క‌న్నీళ్లే వ‌స్తాయి. మ‌నుషుల‌కి క‌ష్టాలే వ‌స్తాయి. కాబట్టి కొత్త‌గా క‌థ‌లు రావు. కొత్త‌గా రాసుకోవాలి, తీయాలి అంతే.

ఇంటి గుట్టులోని ఒక లేయ‌ర్ (పొర‌), దేవుడు చేసిన మ‌నుషులులోని ఒక లేయ‌ర్ క‌లిస్తే అల వైకుంఠ‌పురంలో అవుతుంది. సినిమా ఎలా ఉందంటే …అల్లు అర్జున్ ఎన‌ర్జీతో స్టైలీష్‌గా ఉన్నాడు. ఎమోష‌న్స్ పండించాడు. పూజాహెగ్డె బాగుంది, అందంగా ఉంది. మూడు పాట‌లు మామూలుగా లేవు. ఫైట్స్ అదిరాయి. మ‌రి ఇంకేం అంతా OK క‌దా, అదే కదా క‌న్ప్యూజ‌న్‌. Not OK.

శుభ్రంగా క‌డిగిన అరిటాకు వేశారు. వ‌డ్డ‌న కోసం ఎదురు చూస్తున్నాం. లోప‌ల వంట‌ల సువాస‌న‌లు, ఘుమ‌ఘుమ‌లు ముక్కుకి త‌గులుతున్నాయి. ఆక‌లిగా ఉంది. కానీ అర‌కొర‌గా వ‌డ్డిస్తే ఎలా ఉంటుంది. ఇలాగే ఉంటుంది. ఏం చూశాం భ‌య్యా అంటే అత్తారింటికి దారేది బ‌దులు నాన్నారింటికి దారేది! చూశాం.

త్రివిక్ర‌మ్ , బ‌న్నీ కాంబినేష‌న్ ఎట్లా ఉండాలి? ఏదో కిక్ ఉండాలి, జోష్ ఉండాలి. గ్లాస్ వేడిపాలు, షుగ‌ర్ త‌క్కువేసి ఇస్తే కిక్ వ‌స్తుందా? పాలు రుచిగా ఉంటాయి, ఆరోగ్యం కూడా. స్టెప్స్ కోసం వ‌స్తే టిప్స్ ఇస్తారా?

ఫ్యామిలీ సెంటిమెంట్ , ఎమోష‌న్స్ సినిమాలో కిక్ Expect చేయ‌డం క‌రెక్ట్ కాదు అంటారా, OK. మ‌రి అత్తారింటికి దారేది కూడా ఎమోష‌నే కదా, కిక్ ఎలా వ‌చ్చింది? దాంట్లో దృఢ‌మైన వ్య‌క్తిత్వం ఉన్న అత్త , ఆమెని ఒప్పించి తీసుకెళ్ల‌డానికి వ‌చ్చిన అల్లుడు, వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణే సినిమా.

Conflict లేని సినిమాలు తేలిపోతాయి. దీంట్లో నీచ‌మైన మ‌న‌స్త‌త్వం ఉన్న ముర‌ళీశ‌ర్మ‌తో , నిజాన్ని చెప్పి , నిబ‌ద్ధ‌త‌తో ఉండే హీరోకి సంఘ‌ర్ష‌ణ ఏముంది? పైగా ముర‌ళీశ‌ర్మ నోరెళ్ల‌బెట్టి , కుంటుతూ న‌డ‌వ‌డం త‌ప్ప చేసిందేమీ లేదు. మ‌రి అత‌నితో సంఘ‌ర్ష‌ణ‌కు చాన్స్ ఎక్క‌డుంది?

ఇక స‌ముద్ర‌ఖ‌ని, అద్భుత‌మైన న‌టుడు. స్కోప్ ఉంటే విల‌నీ పండిస్తాడు. అదో ర‌క‌మైన సౌండ్ చేయ‌డం, త‌న్నులు తిన‌డం త‌ప్ప. అత‌ను , అత‌ని కొడుకు , అనుచ‌రుడు అజ‌య్ ఏదో చేసేస్తామ‌ని వ‌స్తారు. హీరో ఇర‌గ‌దీస్తాడు. పోర్ట్ , షేర్స్‌ అని ఏదేదో మాట్లాడుతుంటారు కానీ, హీరోకి గ‌ట్టి స‌వాల్ చేయ‌లేరు. ఆ వైపు నుంచి క‌థ‌లో ఘ‌ర్ష‌ణ పోయింది.

మిగిలింది ఎమోష‌న్‌. రోహిణితో కానీ, ట‌బుతో కానీ ఎమోష‌న‌ల్ ఎటాచ్‌మెంట్ ఎలివేట్ చేసే సీన్స్ లేవు. ఉన్న కాసింత స్కోప్‌లోనే అల్లు అర్జున్ అద్భుత‌మైన ఎమోష‌న్ పండించాడు. (అత్తారింటికి దారేది క్లైమాక్స్‌లా ఒక ట‌ఫ్ సీన్ ఉంటే అర్జున్ త‌న స్టామినా చూపించే వాడే, కానీ అవ‌కాశం రాలేదు)

హీరోయిన్ పూజా, అందంగా క‌నిపించి , పాటలు పాడుతుంది త‌ప్ప న‌టించే చాన్స్ రాలేదు. హీరోహీరోయిన్లు మొద‌టి సారి ఎలా క‌లుసుకుంటారు అనేది డైరెక్ట‌ర్ల‌కి నిజంగా ఫ‌జిల్‌. త్రివిక్ర‌మ్ ఎక్కువ ఆలోచించ‌కుండా పూజా పొట్టి డ్ర‌స్సులు చూసి హీరో ఫిదా అయిపోయేలా క‌న్వినియంట్‌గా ప్రొసీడ్ అయిపోయాడు.

ఇక సుశాంత్ , అయ్యో పాపం! సినిమా అంతా ఏదో అమాయ‌క‌పు చూపులు చూస్తుంటాడు. లాస్ట్‌లో మ‌రీ బాగుండ‌ద‌ని నాలుగు డైలాగ్‌లు చెబుతాడు. సెకండాఫ్‌లో సునీల్ క‌నిపిస్తే హాల్ ద‌ద్ద‌రిల్లిపోయే అరుపులు వినిపిస్తే ఇంకా ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చ‌ర్యం క‌లిగింది. త‌ర్వాత స్ర్కీన్ మీద సునీల్‌ను చూసి జాలి క‌లిగింది. వెన్నెల కిషోర్‌కైనా చిన్న పాత్ర ఉంది కానీ, సునీల్‌కి అదీ లేదు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కి బావ‌మ‌ర్దిగా మిగిలిపోయాడు. చాలా కాలం త‌ర్వాత క‌నిపించిన ట‌బుకి ప్రాధాన్య‌త ఏమీ లేదు. నివేదిత పేతురాజ్ కూడా ఏదో ఉండాలంటే ఉంది.

మొత్తం సినిమా అంతా అల్లు అర్జున్‌, ముర‌ళీశ‌ర్మ భుజాల మీదే న‌డిచింది. క‌థ ప్రారంభంలోనే, క‌థ చివ‌ర్లో ఏం జ‌రుగుతుందో మ‌న‌కు తెలిసిపోతుంది కాబ‌ట్టి , హీరో త‌న వాళ్ల‌ని ఎలా క‌లుసుకున్నాడ‌నేదే పాయింట్‌. ఈ జ‌ర్నీలో ఒక ఉద్వేగాన్ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌లిగించ‌లేక పోయాడు.

ఒక సీన్‌లో హీరో “ఈ ఎపిసోడ్ ఇంత‌టితో అయిపోయిందా?” అని అడుగుతాడు. సినిమా కూడా ఒక మూల‌సూత్రం లేకుండా ఎపిసోడ్ వైజ్‌గా న‌డుస్తుంది. సంఘ‌ట‌న‌లు స‌హ‌జంగా జ‌రిగిన‌ట్టు కాకుండా , అనుకూలం కొద్ది సృష్టించుకున్న‌ట్టు ఉంటాయి.

ఈ సినిమా బాలేద‌ని చెప్ప‌లేం , ఆడుతుంది కూడా. కానీ బ‌న్నీ లాంటి స్టార్‌తో త్రివిక్ర‌మ్ మార్క్ ఎక్క‌డ‌?
చాలా సీన్స్‌లో త్రివిక్ర‌మ్ మాట‌లు అద్భుతంగా ఉన్నాయి. లాజిక్‌తో , మీనింగ్‌తో , ప్రాస‌ల‌తో మ‌న‌ల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేస్తాయి. కానీ మంత్రం ఒక భ్రాంతి మాత్ర‌మే. మాట‌ల‌తో కోర్టులో గెల‌వ‌చ్చు కానీ, ప‌దేప‌దే సినిమాల్లో గెల‌వేలం.

ఈ సినిమాలో మ‌నం న‌వ్వుతాం, ఎమోష‌న‌ల్ ఫీల్ అవుతాం, పాట‌లు ఎంజాయ్ చేస్తాం. మాట‌లు ఎంత బాగా రాశాడు అనుకుంటాం. కానీ ఏదో వెలితి, లోటు.

కార‌ణం గాఢ‌త లోపించ‌డం. ల‌స్సీ ఇస్తార‌నుకుంటే, మ‌జ్జిగ ద‌క్కింది.

Show comments