iDreamPost
android-app
ios-app

అఖిలపక్ష సమావేశంలో వైసిపి తెలుగుదేశం యంపీల మధ్య తీవ్ర వాగ్వాదం

అఖిలపక్ష  సమావేశంలో వైసిపి తెలుగుదేశం యంపీల మధ్య తీవ్ర వాగ్వాదం

రేపటినుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిల పక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటు అన్ని పార్టీలకు సంభందించిన ఫ్లోర్ లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి వైసిపి, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అన్ని పార్టీలతో మాట్లాడుతున్న సందర్భంలో తెలుగుదేశానికి చెందిన యంపీలు మాట్లాడుతూ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించే రాజధాని నిర్మాణం అమరావతిలో మొదలుపెట్టామని, అదేవిధంగా శాసనమండలి రద్దుకు సంబందించిన వ్యవహారంలో కూడా గతంలో వివిధ కమిటీలు ఇచ్చిన సిఫార్సులను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ.. రాజధాని మార్పుకి సంభందించిన అంశంతో పాటు శాసనమండలి రద్దు అంశాన్ని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలనే ప్రస్తావన తీసుకువచ్చారు.

ఇదే సమయంలో వైసిపికి చెందిన యంపీలు కూడా టిడిపి చేస్తున్న వాదనకు అడ్డు చెప్పారు. వైసిపి యంపీలు విజయసాయి రెడ్డి, మిదున్ రెడ్డి లు మాట్లాడుతూ రాజధాని పేరుతొ గత ప్రభుత్వం ఇంసైడ్ ట్రేడింగ్ కి పాల్పడి, రాజధానిలో భారీ భూ దోపిడీకి తెర తీసిందన, దానిపై ఇప్పటికే ఎసిబి-సిఐడి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని, విచారణ జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలపై పార్లమెంట్ లో ఎలా చర్చిస్తారని తెలుగుదేశం యంపీలు చేస్తున్న వాదన ని తీవ్రంగా ఆక్షేపించారు.

ఈ సమయంలో మాటా మాటా పెరిగి ఇరుపక్షాలు తీవ్ర వాగ్వాదానికి దిగిన సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ జోక్యం చేసుకొన్నారు. అంశాలని ప్రస్తావించే సమయంలోనే పరస్పరం వాదులాడుకోవాల్సిన అవసరం లేదని ఇరుపక్షాలను వారించారు. యంపీలు లేవనెత్తిన అంశాలు పార్లమెంట్ లో చర్చిస్తారా లేదా అనేది తర్వాత సంగతని కాబట్టి ఇప్పుడు పరస్పరం ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం లేదని ఇరుపక్షాలకి సర్ది చెప్పారు. సభలో ఏ అంశాలు ప్రస్తావించాలనేది బిఎస్సి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాజధాని అంశాన్ని సభలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వైసిపి యంపీలు అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. వివిధ గ్రాంట్ల కింద రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ కి సంబందించిన రాష్ట్రానికి సంభందించిన 3 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీలతో పాటు రాజధాని నిర్మాణానికి, కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.