మన కథల్లో హీరోయిన్లు షో పీసులేనా

ఇటీవలి కాలంలో మన దర్శకులు అందులోనూ స్టార్ హీరోలను డీల్ చేస్తున్నవాళ్ళలో అధిక శాతం హీరోయిన్లను డమ్మీలుగా కేవలం హీరోతో పాటలు పాడుకోవడం కోసం మాత్రమే అన్నట్టుగా తీర్చిదిద్దుతున్న తీరు నిజంగా ఆక్షేపించదగ్గదే. మొన్న సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాల్లోనూ ఈ ధోరణి గమనించవచ్చు. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న జీవిత లక్యం ఓ అందగాడిని పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకేమి ఉండదు. అందుకోసం ఎలాంటి చీప్ ట్రిక్స్ కైనా తల్లితో సహా రెడీ అయిపోతుంది.

కామెడీ పేరుతో దర్శకుడు అనిల్ రావిపూడి తీర్చిదిద్దిన ట్రాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక సెకండ్ హాఫ్ లో పాటతో కలిపి మొత్తం పావు గంట కన్నా ఎక్కువ కనిపిస్తే ఒట్టు. ఇక రేస్ లో విన్నర్ గా నిలిచిన అల వైకుంఠపురములోనూ అంతే. హీరోయిన్ పూజా హెగ్డే కాళ్ళను చూసి డ్రీం సాంగ్ వేసుకున్న హీరో అటువైపు నుంచి గ్రీన్స్ సిగ్నల్ రాగానే రెండో సగంలో సదరు బుట్టబొమ్మ ఎక్కువ కనిపిస్తే ఒట్టు

నిజానికి కథ డిమాండ్ చేయబట్టో లేక ఇంకో కారణమో ఇలాంటి పోకడను సమర్ధించలేం. మహేష్ బాబు ఒక్కడునే తీసుకుంటే హీరోయిన్ భూమిక లేకపోతే అసలు కథే లేదు. క్లైమాక్స్ దాకా తను ఏదో ఒక ఫ్రేమ్ లో కనిపిస్తూనే ఉంటుంది. మగధీరలో కాజల్ అగర్వాల్ కు ప్రాధాన్యత ఇవ్వకపోతే హీరో విలన్ ల మధ్య సంఘర్షణ ఉండదు. గీత గోవిందంలో రష్మిక మందన్నకు ఇంపార్టెన్స్ లేకుండా స్టోరీని ఊహించుకుంటే చప్పగా తేలిపోతుంది.

అర్జున్ రెడ్డి అంత వయొలెంట్ కావడానికి కారణం ప్రీతీనేగా. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కథలో హీరోయిన్ ని భాగంగా చేసుకున్నవి. కానీ ఇప్పటి సినిమాల్లో చూసుకుంటే కేవలం గ్లామర్ షో కోసం కథానాయికను ఇరికిస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకు గుర్తింపు వచ్చే పాత్రలా అంటే కాదు అని సామాన్య ప్రేక్షకుడు సైతం అంటాడు. ఈ విషయం గురించి కాస్త సీరియస్ గా ఆలోచించాల్సింది మన దర్శకులే.

Show comments