iDreamPost
android-app
ios-app

ఆదుకొంటున్న వాలంటీర్ వ్యవస్థ.

ఆదుకొంటున్న వాలంటీర్ వ్యవస్థ.

కరోనా వ్యాప్తిని అదుపు చేయటం కోసం వాలంటీర్ వ్యవస్థ కృషిని చూస్తుంటే ఏడాది క్రితం ఈ వ్యవస్థ రూపుదిద్దుకొన్నప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన వారు , తేలిగ్గా అంచనా వేసుకున్న వారు ముక్కున వేలేసుకోక తప్పదు.

2019 ఎన్నికల తర్వాత విలేజ్ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసేప్పుడు వివిధ రాజకీయ పక్షాల నుండి , సమాజం నుండి పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. గతంలో ఉన్న జన్మభూమి కమిటీలకు ప్రత్యామ్నాయం అని , కేవలం వైసీపీ పార్టీ వారిని లబ్దిదారులుగా ఎంపిక చేయటానికి , పార్టీ కార్యకర్తలకు ఉపాధి కల్పన లాంటిదని పలు పక్షాలు ఆరోపణలు చేయగా , అనవసర ఖర్చు అని , 50 ఇళ్ళకి ఒకరు చొప్పున ఒక్కో ఊరికి పది మంది వాలంటీర్స్ చేయదగ్గ పనేం ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు . అయినా వైసీపీ అధినేత జగన్ పూర్తి విశ్వాసంతో పట్టుబట్టి వలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశారు.

అయితే వలంటీర్లు విధుల్లో చేరిన నాటి నుండి కాలక్రమేణా అప్పచెప్పిన ఒక్కో బాధ్యతని సమర్థంగా నిర్వహిస్తూ ప్రజామోదంతో పాటు ప్రజాభిమానం కూడా చూరగొన్నారు. తమకు అప్పజెప్పిన 50 కుటుంబాల్లో వ్యక్తులకు కావాల్సిన ఐడీల నుండి పలు సంక్షేమ పథకాలకు అర్హులని గుర్తించడం , వారి ఇంటివద్దకే వెళ్లి పధకాలని వివరించి అప్లై చేయించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సమాచారాన్ని చేరవేసి, నమోదు చేయించి ఆయా సంక్షేమ పథకాల ఫలాలు లబ్ది దారులకు చేరేట్లు చూడటం , సామాజిక పెన్షన్లు వృద్ధులకు, ఇతర విభాగాల వారికీ ఇంటి వద్దే అందించడం లాంటి కార్యకలాపాలతో పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొన్న వీరు ఇప్పుడు యావత్ భారత దేశం దృష్టి తమ వైపు తిప్పుకొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ని అదుపు చేయలేక, వైరస్ బారిన పడే అవకాశం ఉన్న వారిని గుర్తించటంలో సతమతమవుతున్న వేల , ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశాధినేతలు కూడా చేతులెత్తేస్తున్న సమయంలో , మన రాష్ట్రంలో కరోనా అదుపు విషయంలో విలేజ్ , వార్డ్ వలంటీర్లు బాధ్యత తీసుకొని ముందుకొచ్చి చేస్తున్న సేవ గురించి దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా చర్చానీయాంశం అవ్వటం విశేషం .

రెండున్నర లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న ఇళ్లలో ప్రతి ఇంటికీ తిరిగి విదేశాల నుండి వచ్చిన వారిని , అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని సత్వరం గుర్తించి సమాచారం అందించడం , సహాయం కోరి ఫోన్ చేసిన వారికి పూర్తి వివరాలు అందించడంతో పాటు ఆరోగ్యశాఖకి సమాచారమిచ్చి వైద్య సహాయం అందించే ప్రక్రియలో భాగం అవ్వడం వారి నిబద్ధతకు నిదర్శనం .

కరోనా వైరస్ గురించి అందరూ భయపడుతూ ఉన్నవేల పోలీస్ , మెడికల్ సిబ్బందితో సరిసమానంగా వీరు చేస్తున్న కృషి చూస్తుంటే వీరి మీద జగన్ పెట్టుకొన్న నమ్మకానికి సంపూర్తి న్యాయం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ రోజు సోషల్ మీడియాలో వలంటీర్స్ శ్రమ గురించి ట్రెండ్ అయిన కాంప్లిమెంట్….. “వీళ్ళు వలంటీర్స్ కాదు కరోనా వారియర్స్” .

మనందరి ఆరోగ్యం కోసం సమాజ భద్రత కోసం అంకితభావంతో కృషి చేస్తున్న వలంటీర్స్ శ్రమ ఫలించాలని వారు కూడా ఏ కష్టానికి గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకొందాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి