iDreamPost
android-app
ios-app

దూకుడు పెంచిన సిట్.. టిడిపిలో టెన్షన్.. బడా బాబులు బయటపడతారా ?

  • Published Jun 05, 2020 | 9:23 AM Updated Updated Jun 05, 2020 | 9:23 AM
దూకుడు పెంచిన సిట్.. టిడిపిలో టెన్షన్.. బడా బాబులు బయటపడతారా ?

రాజధాని అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో దర్యాప్తు చేస్తున్న ’సిట్’ దూకుడు పెంచింది. చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని నిర్మాణం పేరుతో సుమారు 34 వేల ఎకరాలు భూసమీకరణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు 4700 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. భూ సమీకరణ సందర్భంగా టిడిపిలో కీలక నేతలు, చంద్రబాబు మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలను వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి చేస్తున్నరు.

ఇదే విషయమై వాస్తవాలను రాబట్టేందుకు సిట్ విచారణ చేయిస్తున్నది ప్రభుత్వం. నెలల తరబడి విచారణ చేసిన సిట్ అధికారులు ఇప్పటికే ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఎవరెవరి ప్రమేయం ఉన్నదనే విషయంపై చూచాయగా ఆధారాలు సేకరించారు. విచారణలో బయటకు వచ్చిన ఆధారాల ప్రకారమే ప్రభుత్వం కూడా టిడిపిలో ఎవరెరవరు ? ఎంతెంత భూములు కొన్నారనే విషయాలను వివరంగా అసెంబ్లీలోనే ప్రకటించింది.ఇపుడా విషయంలోనే సిట్ ఒక్కసారిగా జోరు పెంచింది. రెండు రోజుల క్రితమే మాధురి అనే డిప్యుటి కలెక్టర్ ను సిట్ బృందం అరెస్టు చేసింది. పనిలో పనిగా ఇంకా చాలామంది డిప్యుటి కలెక్టర్ల ప్రమేయం విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ల్యాండ్ పూలింగ్ కు రైతులను ఒప్పించేందుకు డిప్యూటి కలెక్టర్లకు అప్పటి ప్రభుత్వం భారీ ఎత్తున నజరానాలు అందచేసిందట. అంటే ప్రభుత్వం నుండి అందుకున్న బహుమానాల కోసమే డిప్యూటి కలెక్టర్లు రైతులను ఏదో ఓ రూపంలో నచ్చచెప్పి ల్యాండ్ పూలింగ్ కు ఒప్పించారని జగన్ సర్కార్ అనుమానిస్తోంది.

ఒకవేళ జగన్ సర్కార్ అనుమానమే నిజమైతే ఇంతకాలం తనను చూసి రైతులు వేలాది ఎకరాలను రాజధాని నిర్మాణానికి వాలంటీర్ గా సహకరించారని చంద్రబాబు చెప్పుకుంటున్నదంతా అబద్ధమ అని తేలిపోతుంది. ఏదో రూపంలో రైతుల నుండి భూములను ఇప్పించిన డిప్యూటి కలెక్టర్లలో చాలామందికి ప్రభుత్వం కుంటలు, మిగులు భూములు, అటవీ భూములు ఇలా మొత్తం 150 ఎకరాలను పంపిణీ చేసినట్లు సిట్ గుర్తించింది.

పనిలో పనిగా అమరావతి ప్రాంతంలోని టిడిపి నేతల్లో కొందరు గ్రామ కంఠం భూములు, చెరువు భూములను కూడా తమ పేరుతో రాయించేసుకున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రభుత్వ భూమిని వీళ్ళ పేరుతో రాయించేసుకోవటంతో ఇదే భూమిని వీళ్ళు తిరిగి ప్రభుత్వానికి భూ సమీకరణలో ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించుకున్నారు. భూ సమీకరణలో తమ భూములను ప్రభుత్వానికి రాసిచ్చేసినందుకు వీళ్ళకు మళ్ళీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కావాల్సిన చోట ప్లాట్లు కేటాయించిందట. ఈ విషయాలన్నీ సిట్ దర్యాప్తులో బయటపడుతుండటంతో అప్పటి డిప్యూటి కలెక్టర్లు, టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. టిడిపి నేతలు, డిప్యూటి కలెక్టర్లంటే వీళ్ళ వెనుకున్న బడాబాబులు కూడా బయటకు రావటం ఖాయమే. మటి సిట్ దర్యాప్తులో బయటపడే బడా బాబులెవరో చూడాల్సిందే.