iDreamPost
android-app
ios-app

వాళ్లని కిడ్నాప్ చేశారని బాబు అన్నారు..కానీ రిమాండ్ కి తరలించారు

  • Published May 04, 2020 | 9:02 AM Updated Updated May 04, 2020 | 9:02 AM
వాళ్లని కిడ్నాప్ చేశారని బాబు అన్నారు..కానీ రిమాండ్ కి తరలించారు

మైరా టీవీ కి చెందిన కొందరు వ్యక్తులను పోలీసులు కిడ్నాప్ చేసినట్టు టీడీపీ అదినేత చంద్రబాబు ప్రకటించారు. కానీ వారు ఆంక్షలు ఉల్లఘించడంతో అరెస్ట్ అయినట్టు పోలీసులు నిర్ధారించారు. చివరకు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ కి కూడా వెళ్లారు. దాంతో మైరా అనే వెబ్ చానెల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వం మీద బురదజల్లేందుకు ప్రముఖ మీడియా సంస్థలకు తోడుగా సోషల్ మీడియాలో కూడా కొన్ని సంస్థలను టీడీపీ నడుపుతుందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు అలాంటి సంస్థల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. దాంతో ఆయా మీడియా సంస్థల ముసుగులో పార్టీ ప్రచారం, పక్కదారి పట్టించే సమాచారం అందిస్తున్న వారిని అదుపు చేయడం టీడీపీకి మింగుడుపడడం లేదనే వాదన బలపడుతోంది. నేరుగా చంద్రబాబు సీన్ లోకి వచ్చి ఓ చిన్న వెబ్ చానెల్ విలేకరుల అరెస్ట్ వ్యవహారాన్ని రాజకీయంగా చేసేందుకు ప్రయత్నించడం అందులో భాగమే అంటున్నారు.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. వాటిని అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. కానీ కొందరు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించడంతో ఇప్పటికే పలు చోట్ల కేసులు పెట్టడం, వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరిగాయి. ఈ విషయంలో అత్యధిక కేసులు అనంతపురం జిల్లాలో నమోదు కాగా, అత్యధికంగా వెహికల్స్ సీజ్ విజయవాడలో జరిగిందని ఏపీ పోలీసులు ప్రకటించారు. అదే పరంపరలో కర్నూలు జిల్లాలో నిబంధనలు ఉల్లఘించి ప్రయాణాలు సాగిస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా గాజులపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చెకింగ్ చేస్తుండగా దురుసుగా ప్రవర్తించి, ప్రకాశం జిల్లా వైపు వేగంగా తరలిపోతున్న వాహనాన్ని వెంబబడించి పొదిలి మండలం కొనేకల్లు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

దాంతో ఆ వాహనంలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు కర్నూలు జిల్లా మహానంది పోలీసులు మీడియాకు తెలిపారు. అలా అరెస్ట్ అయిన వారిలో కృష్ణా జిల్లా ఉట్కూరుకి చెందిన చెరుకూరి కృష్ణారావు, చెరుకూరి సవిత వరేణ్య, ఉయ్యూరు శ్రీనివాసరావు, ఆముదాల తిరుమలేశు ఉన్నట్టు ప్రకటించారు. వీరంతా మైరా టీవీ ప్రతినిధులను ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అయితే టీడీపీ అధినేత చేసిన వాదనను పోలీసులు తిప్పికొట్టారు. మీడియా ప్రతినిధులు కాబట్టి అదుపులోకి తీసుకున్నారని చంద్రబాబు ట్వీట్ చేయగా, పోలీసులు మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో మెజిస్ట్రేట్ ఆదేశాలతో రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు.