కరోనా పై యుద్ధానికి ఏపీ సిద్ధం

మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ పలు దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మన దేశంలో వైరస్ వ్యాప్తి ఇతర దేశాల్లో కన్నా తక్కువగా ఉంది. మహారాష్ట్ర లో కరోనా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల లో తెలంగాణ కన్నా , ఏపీ లో తక్కువగానే ఉంది. అయినా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కరోనా అందరినీ చుట్టుముట్టడంతో ఎవరినీ వారు కాపాడుకునేందుకు శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు, సంస్థల సహాయం పొందేందుకు వీలులేకుండా పోతోంది. ఎలాంటి పరిస్థితి లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకుంటోంది. కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు అవసరమైన రక్షణ సామాగ్రిని సొంతంగా తయారు చేసుకుంటోంది. మాస్కులు, పీపీఈ కిట్లు ఏపిలోనే తయారవుతున్నాయి.

కొత్తగా వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేస్తున్నారు. రెడ్ జోన్ ల వారిగా పరీక్షలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. రాష్ట్రం మొత్తం మీద 474 క్వారంటైన్ కేంద్రాలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఆయా కేంద్రాల్లో 46,872 బెడ్లు అందుబాటులో ఉంచారు. ఎక్కడ వారిని అక్కడే పర్యవేక్షణ లో ఉంచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ సిద్ధమైనట్లు ఈ ఏర్పాట్లు ద్వారా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే వాలంటీర్ల, ఆశా వర్కర్ల ద్వారా రెండు సర్వేలు చేయించిన జగన్ సర్కారు విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించారు. సర్వే ద్వారా గుర్తించిన వారిలో 24,537 మందిని గృహ నిర్బంధంలో ఉంచగా.. మరో 5,900 మందికి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారు మినహా ప్రస్తుతం దాదాపు 5,600 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా ను మరింత కట్టడి చేసేందుకు మూడో దఫా సర్వే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు.

Show comments