కొద్దిసేపటిక్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎట్టకేలకు ఉభయసభలను గవర్నర్ ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్ కు ఆరు నెలల వరకు చట్టబద్దత ఉంటుంది. అయితే మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను ప్రభుత్వం వెనుకకి తీసుకోవాల్సి ఉంటుంది. బిల్లులు శాసనమండలిలో పెండింగ్ లో ఉన్నప్పటికీ సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపుతున్నానని ప్రకటించి శాసనమండలిని నిరవదికంగా వాయిదా వేశారు. అయితే మండలి చైర్మన్ నిబంధనలను ఉల్లంఘించారాని అధికార పక్షం ఆరోపించడంతో దానిమీద అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగడం, ఈ నేపథ్యంలోనే శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం చెయ్యడం ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించడం చకచకా జరిగిపోయాయి. నిన్న ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అయిన సందర్భంగా మండలి రద్దు బిల్లును ఆమోదించాలని కోరారు.
ఇదిలా ఉంటే వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్ షరీఫ్.. సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీకి పేర్లు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి ఛైర్మన్ ఆదేశించారు. కానీ కార్యదర్శి మాత్రం ఆ ఫైల్‌ను వెనక్కి పంపించారు. అయితే ఇప్పటివరకు సెలక్ట్ కమిటీ కూడా ఏర్పాటు కాలేదు.
ఒకపక్క ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే గవర్నర్ ఈరోజు ఉభయసభలను ప్రోరోగ్ చేయడంతో, శాసనమండలి లో పెండింగ్ లో ఉన్న బిల్లుల స్థానంలో కొత్తగా ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు అమలులోకి వచ్చినట్లేనని న్యాయ నిపుణుకులు పేర్కొంటున్నారు.
అయితే ఈ ఆర్డినెన్స్ కాలవ్యవధి ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఈ లోగా అసెంబ్లీలో మరోసారి కొత్తగా బిల్లులు పెట్టి ఆమోదించుకోవచ్చు.
ఆర్డినెన్స్ ద్వారా ఈ రెండు బిల్లులు ఆమోదిస్తే అమరావతి నుండి ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని భావిస్తోంది. ఇలా చెయ్యడం ద్వారా ప్రభుత్వానికి న్యాయపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరోవైపు ఈ బిల్లులపై ఈనెల 25న హైకోర్టు లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖ నుంచే పాలన కొనసాగుతోందని చెప్పారు. ఆ దిశగానే ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.