iDreamPost
android-app
ios-app

కరోనా విపత్తు- ఆంద్రప్రదేశ్ అనుభవం- అందరి దృష్టిని ఎందుకు ఆకర్షిస్తోంది

  • Published Jun 15, 2020 | 5:18 AM Updated Updated Jun 15, 2020 | 5:18 AM
కరోనా విపత్తు- ఆంద్రప్రదేశ్ అనుభవం- అందరి దృష్టిని ఎందుకు ఆకర్షిస్తోంది

విపత్తులు వస్తాయి. వాటిని ఎదుర్కని నిలబడినప్పుడే నిజమైన సామర్థ్యం బయటపడుతుంది. కష్టాలను ధీటుగా ఎదుర్కొన్న వాళ్లే తమ జీవితంలో రాణించే అవకాశం ఉన్నట్టుగానే ప్రభుత్వాలు కూడా ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడంలో ప్రదర్శించే పరిణతి అందరికీ పాఠం అవుతుంది. ప్రపంచమే ఇప్పుడు మహమ్మారి వలలో చిక్కుకున్న సమయంలో కొన్ని చోట్ల సమస్య తీవ్రమవుతోంది. రానురాను చేజారిపోతుందనే అభిప్రాయం బలపడుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని కలవరపరుస్తోంది. మరికొన్ని చోట్ల కరోనా తాకిడి తీవ్రత కాకుండా ఆయా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ కొంత ఫలితాలు కూడా సాధించాయి. అలాంటి రాష్ట్రాల్లో కేరళ వంటివి ముందుండగా, ఆంధ్రప్రదేశ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు దేశంలో అనేక మంది ఏపీ పరిస్థితిని ఆశావాహకంగా చూస్తుండడం విశేషం.

ఏప్రిల్, మే నెలల మధ్య వరకూ అనేక మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సెటైర్లు విసిరారు. సీఎం జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. కరోనా విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టారు. నియంత్రణ లేకుండా పోతోందని హైదరాబాద్ లో కూర్చని చంద్రబాబు సహా అందరూ విమర్శించారు. తెలంగాణాతో పోలుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద రాజకీయ దుమారం రేపే ప్రయత్నం చేశారు. చివరకు ఆ రాష్ట్రానికి ఓ మంత్రి అయితే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్న వారికి అవార్డులు ఇవ్వరంటూ ఏపీ తీరు మీద వ్యంగ్యంగా మాట్లాడారు. అదే సమయంలో కేసీఆర్ సుదీర్ఘ ప్రెస్ మీట్లలో చేసే వ్యాఖ్యలను చూపించి, ఉభయ రాష్ట్రాలకు ఆయనే దిక్కు అంటూ కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు. కానీ తీరా చూస్తే జూన్ మధ్యకు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణా తల్లడిల్లిపోతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కేసులు అలజడి రేపుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలకు, మంత్రుల అతి సన్నిహితులకు కూడా వైరస్ వ్యాపించి విలయతాండవం చేస్తోంది.

మార్చి 15 నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. కరోనా అనేది ఇప్పట్లో పోయేది కాదని, దానికి మందులు కూడా లేవని ఆయన చెప్పిన దానిని వక్రీకరించేందుకు జగన్ అంటే గిట్టని బ్యాచ్ బలంగా ప్రయత్నించింది. ఆ తర్వాత కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటూ చెప్పిన మాటలను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏపీ ప్రభుత్వాధినేత వ్యాఖ్యల్లో వాస్తవం అందరూ అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో జగన్ ని తప్పుబట్టిన వారు కూడా ఇప్పుడు జగన్ మాటలే వాస్తవం అంటున్నారు. చివరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారు కూడా కేసీఆర్ మాటలకే పరిమితం కాగా, జగన్ చేతల్లో కరోనా కట్టడికి కట్టుబడి ఉన్నారనే రీతిలో వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ఏపీ ఎలా కట్టడి చేయగలిగింది

ఏపీ ప్రభుత్వం ఎందుకిప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నదే ప్రధానాంశం. మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో సాగింది. ఏప్రిల్ 15 నాటికి కరోనా ఫ్రీ రాష్ట్రం అయిపోతోందనే ఆడంబారాలకు పోకుండా సుదీర్ఘ సమయం పాటు వైరస్ తో సమరం చేయాల్సిందేనని ముందుచూపుతో సన్నద్దమయ్యింది. ఉదాహరణకు కరోనా టెస్టింగ్ సెంటర్లను పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మార్చి నాటికి ఏపీలో కరోనా టెస్టింగ్ అవకాశం లేదు. శాంపిళ్లను తొలినాళ్లలో పూణే వైరాలజీ ల్యాబ్ కి పంపించాల్సి వచ్చింది. ఫలితాల కోసం రెండు, మూడు రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది.

ప్రస్తుతం ఏపీలో మొత్తం 52 టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేశారంటే ప్రభుత్వ పనితీరుకి అద్దంపడుతోంది. మూడు నెలల్లో సున్నా నుంచి 52కి ల్యాబ్స్ సంఖ్య పెంచడం ఆషామాషీ కాదు. అది దేశంలోనే అత్యధికంగా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతీ జిల్లాకు కనీసం 2 ల్యాబులకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయడం విశేషమే. అంతేగాకుండా పరీక్షల విషయంలో ప్రభుత్వం పెద్ద ప్రయత్నమే చేసింది. మార్చి చివరి నాటికి రోజుకి 50 పరీక్షలు మాత్రమే చేయగల రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి 15వేల పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరింది. దానిని మరింత పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారమే సగటున మిలియన్ జనాభాకు చేసే టెస్టుల సంఖ్యలో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ముందు వరుసలో ఉంది. ఒక మిలియన్ జనాభాలో 10వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్ ని అరికట్టే ప్రయత్నం సాగింది.

విస్తృత నెట్ వర్క్, డేటా వినియోగం లో సమర్థత

ఏపీ ప్రభుత్వానికి ఉన్న నెట్ వర్క్ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదనే చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలు ఇలాంటి విపత్కర సమయంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటరీ ఉండడంతో వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరించడం సులువు అయ్యింది. క్షేత్రస్థాయి పారా మెడికల్ సిబ్బంది ఆశా, ఏఎన్ఎంలతో కలిసి మూడు నాలుగు సార్లు సర్వేలు నిర్వహించారు. తద్వారా వారు సేకరించిన డేటా ఆధారంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని వెంటనే గుర్తించే అవకాశం కలిగింది. ఆ డేటా ఆధారంగా రాష్ట్ర కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని విశ్లేషించే మార్గం సుగమం అయ్యింది. స్వయంగా సీఎం రెండు నెలల పాటు కరోనా సమీక్షల ద్వారా పలు సూచనలు చేస్తూ సమస్య వేగంగా పెరగడకుండా నియంత్రించడంలో విజయవంతం అయ్యారు.

సిబ్బంది నియామకం, సామాగ్రి అందించడంలో చొరవ

తద్వారా ఇప్పుడు సమీప రాష్ట్రాలు తెలంగాణా, తమిళనాడు వంటివి తలలు పట్టుకునే స్థాయిలో చేరినప్పటికీ ఏపీ ప్రభుత్వం కాస్త స్థిరంగా సాగుతోంది. వైరస్ మరింత వేగంగా పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే గ్రహించారు. దానికి అనుగుణంగా గ్రామ సచివాలయ స్థాయిలో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అప్రమత్తమవుతున్నారు. ఓవైపు పరీక్షలు, మరోవైపు తగిన సామాగ్రి, సిబ్బందిని సన్నద్ధం చేయడంలో సమర్థవంతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పీపీఈ కిట్లు ఏపీలోనే సిద్ధం చేసుకుని, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరారు. మాస్కులు ఇంటింటికీ పంపిణీ చేయించారు. వెంటిలేటర్లు, ఇతర కీలక మెడికల్ అవసరాలపై దృష్టి సారించారు.

వాటితో పాటుగా సిబ్బంది నియామకం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా డాక్టర్లు, ఇతర ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే పలు నియామకాలు పూర్తి చేసింది. దాంతో పరీక్షలు, వైద్య సహాయం అందించే వారి కొరత లేకుండా చూసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పస్టంగా చెప్పవచ్చు.

అనేక అభివృద్ధి చెందిన దేశాలు, దేశంలో కూడా అభివృద్దిలో ముందున్న కీలక రాష్ట్రాలు కల్లోలం అవుతుంటే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రం ప్రస్తుతం కొంత స్తిమితంగా ఉండడంలో ప్రభుత్వ చొరవ గుర్తించవచ్చు. కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విమర్శలకు, ఇతరుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన పని తాను చేసుకుపోవడం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రదర్శించిన నిబద్ధత గమనించవచ్చు. ముందుచూపు ఉన్న నాయకుడు , ప్రజలను ఆందోళన పాలుజేయడం కాకుండా అవగాహనతో సాగుతారనడానికి తాజా అనుభవం చాటిచెబుతోంది. ప్రస్తుతానికి కొంత సక్సెస్ అయినట్టు కనిపిస్తున్న ఏపీ లో భవిష్యత్ లో కూడా పరిస్థితి చేజారిపోకుండా చూసుకునేందుకు యంత్రాంగం తగిన దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్ర జగన్ కూడా అధికారులు, సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఏమయినా ప్రస్తుతానికి ఏపీలో కొంత ఊరట కల్పించే పరిస్థితిని కల్పించిన ఏపీ ప్రభుత్వ పనితీరు దేశమంతా వివిధ రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.