iDreamPost
android-app
ios-app

చిక్కుముడిగా మారిన సెల‌క్ట్ క‌మిటీ

  • Published Feb 04, 2020 | 2:08 PM Updated Updated Feb 04, 2020 | 2:08 PM
చిక్కుముడిగా మారిన సెల‌క్ట్ క‌మిటీ

వికేంద్రీక‌ర‌ణ బిల్లుని సెల‌క్ట్ క‌మిటీకి పంపించ‌డం తో మొద‌ల‌యిన రాజ‌కీయ దుమారం కొన‌సాగుతోంది. సెల‌క్ట్ క‌మిటీ చుట్టూ అల‌ముకున్న రాజ‌కీయ వివాదం చివ‌ర‌కు మండ‌లిని ముగింపు ద‌శ‌కు చేర్చింది. అయినా ప్ర‌తిప‌క్షం ప‌ట్టు స‌డ‌లించ‌డం లేదు. సెల‌క్ట్ క‌మిటీ విష‌యంలో త‌న ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. స‌ర్కారుకి చెక్ పెట్టేందుకు అదే ప్ర‌ధాన అస్త్రంగా భావిస్తోంది. ఇప్ప‌టికే మండ‌లి తీర్మానం విష‌యంలో కేంద్రం ఎప్ప‌టికి క‌నిక‌రిస్తుంద‌న్న‌ది స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బ‌డ్జెట్ సెష‌న్ లో ప్ర‌వేశ పెట్టే బిల్లుల విష‌యంలో ఇప్ప‌టికే కేంద్రం పార్ల‌మెంట్ ముందు ప్ర‌తిపాదించింది. అందులో 45 బిల్లుల‌కు గానూ ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దు బిల్లు క‌నిపించలేదు. దాంతో వ‌చ్చే వ‌ర్షాకాల స‌మావేశాల వ‌ర‌కూ వేచి చూడ‌క త‌ప్ప‌ద‌నే వాద‌న వినిపిస్తోంది. అయినా చివ‌రి నిమిషంలో ఈసారి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్టినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నే అభిప్రాయం కూడా కొంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ ప‌రిస్థితుల్లో మండ‌లి సెల‌క్ట్ బిల్లు చుట్టూ విప‌క్ష రాజ‌కీయం న‌డుస్తోంది. సెల‌క్ట్ క‌మిటీ స‌భ్యుల జాబితా విష‌యంలో అధికార‌, విప‌క్షాలు ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ, పీడీఎఫ్ ప‌క్షాల లిస్టు ఇవ్వ‌డంతో టీడీపీ కూడా త‌మ జాబితాను మండ‌లి కార్య‌ద‌ర్శికి పంపించింది. ఈ నేప‌థ్యంలో అంద‌రి దృష్టి వైఎస్సార్సీ వైపు మ‌ళ్లింది. కానీ ఆపార్టీ మాత్రం స‌సేమీరా అంటోంది. సెల‌క్ట్ క‌మిటీని గుర్తించ‌లేద‌ని తేల్చేసింది. దాంతో ఇప్పుడు ఇదో చిక్కుముడిగా మారుతోంది. చివ‌ర‌కు ఎటు మ‌ళ్లుతుందోన‌నే సందిగ్ధం క‌నిపిస్తోంది. మండ‌లి ర‌ద్ద‌యితే సెల‌క్ట్ క‌మిటీ తంతు ముగుస్తుంది. కానీ దానికి భిన్నంగా మండ‌లి వ్య‌వ‌హారాన్ని కేంద్రం తాత్సార్యం చేస్తే అప్పుడు సెల‌క్ట్ క‌మిటీ ఏవిధంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న‌దే ఆస‌క్తిక‌రం.

వైఎస్సార్సీపీ మాత్రం అస‌లు స‌లెక్ట్ క‌మిటీ అన్న‌ది తాము గుర్తించ‌డం లేద‌ని తేల్చేశారు. అ లేని సెలెక్ట్‌ కమిటీకి తాము పేర్లు పంపడం ఏంటని ప్ర‌శ్నిస్తోంది. ఆపార్టీ నాయ‌కుడు సజ్జల రామ‌కృష్ణా రెడ్డి అంశంపై మాట్లాడుతూ సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలంటే సభ్యుల అభిప్రాయం తీసుకొని ఓటింగ్‌ పెట్టాలని.. అవేవి లేకుండా ప్రతిపక్ష పార్టీలు పేర్లు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు.సభలో టీడీపీకి నలుగురు సభ్యులు ఎక్కువ ఉన్నారని ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం సరికాదన్నారు. శాసన మండలి చైర్మన్‌ టీడీపీ కార్యకర్తల వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేదంటే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను తాత్కాలిక అడ్డుకోగలరు కానీ శాశ్వతంగా అడ్డుకోలేరని సజ్జల అన్నారు. దాంతో ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. పాల‌క‌ప‌క్షం కుద‌ర‌దు అంటున్న త‌రుణంలో ప్ర‌తిప‌క్షాల స‌భ్యుల‌తో స‌న్న‌ద్ధ‌మ‌యిన క‌మిటీ ముందుకు సాగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఇద్ద‌రు మంత్రులు క‌మిటీల‌కు చైర్మ‌న్ గా ఉండాల్సి ఉంటుంది. ఈ త‌రుణంలో వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశ‌మే.