iDreamPost
iDreamPost
దేశంలో ఇప్పుడు అనేక చోట్ల కరోనా అనుమానితుల క్వారంటైన్ పెద్ద సమస్యగా మారుతోంది. అందరినీ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఎంతగా చెబుతున్నా కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆంక్షలు అధిగమిచి రోడ్డు మీదకు వచ్చేవారు కొందరైతే, అనుమానితులుగా ఉండి కూడా క్వారంటైన్ కేంద్రాలకు రావడానికి నిరాకరిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఇదే ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. అనేకమార్లు విన్నవించినా పట్టించుకోని అలాంటి వారిపై హత్యాయత్నం కేసులు కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెల్ఫ్ క్వారంటైన్ కి సిద్ధపడ్డారు. తొలుత కరోనా పరీక్షలు చేయించుకుని, ఫలితాలు వచ్చే వరకూ తగు జాగ్రత్తలు పాటించారు. తద్వారా అనేక మంది అపోహలతో ఉన్న వారికి ఆయన ఆదర్శంగా నిలిచారు. వ్యక్తిగత జాగ్రత్తలు , భౌతికదూరం పాటిస్తూ మహమ్మారిని తరమాల్సిన సమయంలో అందరూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిన అవసరాన్ని ఆయన ఆచరణతో చూపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి కరోనా బాధితుడి నెల్లూరు వాసి కావడం విశేషం. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు తగు సూచనలు చేస్తూ మంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు రోడ్డెక్కి సామాన్యులను బయటకు రావద్దని వేడుకున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ ఆయన 36గం.ల పాటు సెల్ఫ్ క్వారంటైన్ పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. మంత్రి అనిల్ తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, ప్రతీ ఒక్కరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోందని వైద్యులు సూచిస్తున్నారు.