iDreamPost
android-app
ios-app

జర్నలిజం అంటే ఇంతేనా రాధాకృష్ణ గారు?ప్రాస కోసం ఏదైనా రాస్తారా?

  • Published May 07, 2020 | 6:53 AM Updated Updated May 07, 2020 | 6:53 AM
జర్నలిజం అంటే ఇంతేనా రాధాకృష్ణ గారు?ప్రాస కోసం ఏదైనా రాస్తారా?

ఒక పౌరుడు కానీ , విపక్ష నాయకులు కానీ , ప్రభుత్వం పై , లేదా ఉద్యోగి , అధికార పార్టీ నేతల పై ఆర్ధిక పరమైన నేరారోపణ చేసినప్పుడు వాటిని ప్రచురించే , ప్రసారం చేసే మీడియా సంస్థలు ఆ ఆరోపణల్లో నిజానిజాలెంత అనేది పరిశోధించుకొని , లేదా సదరు ఉద్యోగిని , కానీ ప్రభుత్వ కార్యాలయ అధికారుల్ని కానీ వివరణ కోరి సదరు వార్తని వివరణతో సహా లేదా విశ్లేషణతో ప్రచురిస్తారు . అది పాత్రికేయ ధర్మం . ఆ ప్రక్రియ లేకుండా వార్త ప్రచురించడం అనైతికం . సదరు వార్త దురుద్దేశ్యంతో మరొకరి ప్రయోజనాల కోసం జర్నలిజం విలువల్ని హత్య చేసి రాసిన వార్త అని ఆ రోజు కాకపోయినా మరో రోజు పౌర సమాజం తెలుసుకొంటుంది . ఆ రోజు సదరు మీడియా సంస్థ ప్రజల ముందు దోషిలా తలవంచుకొని నిలబడాల్సి ఉంటుంది .

ఆ సందర్భం నీకు ఈరోజు వచ్చింది రాధాకృష్ణ గారు.. .

గత మార్చ్ మూడవ తారీఖు టీడీపీ నేత ‘బోండా ఉమ’ ప్రభుత్వ నూతన మద్యం పాలసీ పై మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రతి నెలా మద్యం తయారీ దారుల వద్ద 300 కోట్లు ‘జే టాక్స్’ తీసుకొని ఇండెట్లు ఇస్తున్నారని ఆరోపించారు .

సదరు ఆరోపణ పై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి కానీ CMO నుండి కానీ మీరు ఏ విధమైన వివరణ తీసుకోకుండానే , కొనుగోలు అమ్మకాల వాస్తవిక విశ్లేషణ కూడా లేకుండా అదే ఆరోపణని నిజమని భ్రమింపజేసే విధంగా అదే రోజు మీ టీవీలో ప్రసారం చేయటంతో పాటు తర్వాతి రోజు 4వ తారీఖు మీ పేపర్ మొదటి పేజీలో అత్యంత ప్రముఖ వార్తగా ప్రచురించారు . ఇది జరిగి రెణ్ణెళ్ళు గడిచింది .

ప్రస్తుతం లాక్ డౌన్ స్థితిలో కేంద్ర ప్రభుత్వ సూచనలను అనుసరించి మద్యం దుకాణాలు తెరిచిన ప్రభుత్వం 75 శాతం ధరలు కూడా పెంచింది . సదరు అంశం పై ఆంధ్రజ్యోతి పత్రికలో “అమ్మ వడి , నాన్న తడి” అనే హెడ్డింగ్ తో ప్రచురించిన వార్తలో 18 రూపాయలకు ఖరీదు చేసిన మద్యం సీసా 170 రూపాయలకు ప్రభుత్వం అమ్ముతుందని , ఎక్సైజ్ డ్యూటీ , వ్యాట్ , రిటైల్ ఎక్సైజ్ టాక్స్ , ప్రివిలైజ్ ఫీజ్ , CMRF లాంటి వివిధ పన్నుల ద్వారా 100 రూపాయల మద్యం అమ్మకం పై 90 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చెందుతుందని అందుమూలంగా ‘అమ్మవడి’ పధకం ద్వారా ఇచ్చిన మొత్తం ‘నాన్న తడి’ ద్వారా వెనక్కి లాగేసుకొంటుందని ప్రభుత్వం పై ఆరోపణలతో విశ్లేషించారు . అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే ఈ వార్తలో అమ్మవడి పధకం ద్వారా లబ్ది పొందిన మహిళల భర్తలు అందరూ 365 రోజులూ మందు తాగే సతర్నిత్య తాగుబోతులుగా నిర్ధారిస్తూ అంచనాలు రూపొందించింది ఆంధ్రజ్యోతి యాజమాన్యం .

అమ్మవడి , ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పథకాల ప్రకటన సమయంలో కానీ , అమలు దశలో కానీ ఏ రోజూ సానుకూల స్పందన కనపరచకపోగా పలు కోణాల్లో వ్యతిరేక కధనాలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు అమ్మవడి లబ్దిదారుల్ని , వారు ప్రభుత్వం నుండి పొందిన లబ్దిని ఇప్పటికైనా గుర్తించడం శుభ పరిణామమే కానీ వారి భర్తలు అందరూ తాగుబోతులే అని నిర్ధారించడం వ్యతిరేకించాల్సిన వార్త . ఇది అమ్మవడి లబ్దిదారుల భర్తల్ని సామూహికంగా అవమానించడమే , ఈ వార్తా క్రమంలో పలుమార్లు వాడిన భాష కూడా జర్నలిజం విలువలు దిగజార్చే విధంగా ఉండగా దీనికి పరాకాష్ట ఈ రోజు న్యూస్ హెడ్డింగ్ “అమ్మ వడికి ఇచ్చి నాన్న తడికి గిచ్చారు” అంటూ చౌకబారు హెడ్డింగ్ పెట్టటం ఏ జర్నలిజం విలువలో రాధాకృష్ణకే తెలియాలి .

సదరు వార్తలో అమ్మవడి లబ్ధిదారుల భర్తలు ఎంతమంది తాగి నష్టపోయారు అన్న అంశం పక్కన బెడితే ఆంధ్రజ్యోతి విశ్లేషణ ప్రకారం వైసీపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమలులోకి తెచ్చాక మద్యం కొనుగోలు ,అమ్మకాలు ,ప్రభుత్వ ఆదాయం ఎంతో చూద్దాం . 2019 అక్టోబర్ 2 న నూతన మద్యం పాలసీ అమల్లోకి తెచ్చిన నాటి నుండి 2020 ఫిబ్రవరి వరకూ (లాక్ డౌన్ వలన మార్చ్ , ఏప్రిల్ నెలల అమ్మకాలు పరిగణనలోకి తీసుకోలేదు) ఐదు నెలల మద్యం అమ్మకం ద్వారా ఖజానాకు జమ అయ్యిన మొత్తం 8144.24 కోట్లు . ఇందులో ABN అంచనా ప్రకారం ప్రభుత్వ కొనుగోలు విలువ 814.42 కోట్లు ట్రాన్స్పోర్ట్ , స్టోరేజ్ , లేబర్ ఖర్చులు కలుపుకొన్నా 1000 కోట్లకు మించదు . అంటే మద్యం పై నెలకి 200 కోట్లు వెచ్చించింది వైసీపీ ప్రభుత్వం .

బోండా ఉమా ఆరోపణలలో నిజం ఎంత?

వైసీపీ ప్రభుత్వం నెలకి రెండు వందల కోట్ల రూపాయల మద్యం కొనుగోలు చేస్తుందని నీ ABN లో ధర , పన్నులు , ఇతరత్రాలతో విశ్లేషిస్తూ నెలకి 300 కోట్లు జగన్ ‘జే టాక్స్’ వసూలు చేస్తున్నాడన్న బోండా ఉమా ఆరోపణలు సత్యదూరమని తెలుస్తూనే ఉన్నా ఆ విషయం మరుగుపరిచి సదరు ఆరోపణల్ని యధాతధంగా ప్రచురించడం గర్హనీయం .

ఈ రోజు వేసిన లెక్కలు ఆ రోజు ఏమయ్యాయి . బోండా ఉమా నెలకి మూడు వందల కోట్లు లంచం తీసుకొంటున్నారు అని ఆరోపించినప్పుడు , ప్రభుత్వం నెలకి కొనుగోలు చేస్తున్నది రెండు వందల కోట్లకి అయితే మూడు వందల కోట్లు లంచం ఎలా తీసుకొంటారు . కొనుగోలు విలువ కన్నా వంద కోట్లు అదనం ఇచ్చే పిచ్చివాడు ఎవరుంటారు , ఈ ఆరోపణకి మీ దగ్గరున్న ఆధారాలేంటి అని ప్రశ్నించటానికి గొంతు రాలేదు , కలం కదలనంది.

పదే పదే దమ్మున్న ఛానెల్ అని చెప్పుకొనే రాధాకృష్ణ దమ్ము అబద్ధపు వార్తలు రాయటానికే పనికొచ్చింది , ఆధారాలు కాదు కదా , కనీసపు విచక్షణ లేని సత్యదూరమైన , దురుద్దేశ్యపూర్వక రాజకీయ ఆరోపణలు చేసిన వారికి కొమ్ముకాస్తూ అదే అసత్యాన్ని భూతద్దంలో పెట్టి చూపించి అదే నిజమని ప్రజల్ని నమ్మింపజేసే ప్రయత్నం చేయటంతో రాధాకృష్ణ చెప్పుకొనే జర్నలిజం విలువల్ని తనే స్వయంగా హత్య చేసినట్టు అయ్యింది .