iDreamPost
android-app
ios-app

రైతు సంక్షేమం లక్ష్యంగా జగన్‌ సర్కార్‌ మరో నిర్ణయం

రైతు సంక్షేమం లక్ష్యంగా జగన్‌ సర్కార్‌ మరో నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీసర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడంచెల వ్యవసాయ సలహా కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తున్న నేపథ్యంలో అంతకు ముందుగానే కమిటీలను ఏర్పాటు చేయడం విశేషం. రైతులకు సంబంధించి అన్ని విషయాల్లోనూ ఈ కమిటీలు పని చేస్తాయి. పంట వేయడం నుంచి ఎరువులు, పురుగుమందులు, సాంకేతికత, పంట గిరాకీ, మార్కెటింగ్, మద్ధతు ధర, ఇతర సమస్యలపై ఈ కమిటీలు పని చేయనున్నాయి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేశారు.

– రాష్ట్ర స్థాయిలో కమిటీకి వ్యవసాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యాదర్శి వైస్‌ చైర్మన్‌గా, ఆ శాఖ కమిషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌ ఉంటారు. సభ్యులుగా వ్యవసాయం, మార్కెటింగ్, హార్టికల్చర్‌ శాఖల ఉన్నతాధికారులు, అగ్రి, ఉద్యనవన వర్సిటీలు, పరిశోధన కేంద్రాలు, ఏపీ ఆగ్రోస్, మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్, పలు రంగాల ప్రతినిధులుతోపాటు 10 మంది రైతులు ఉంటారు.

– జిల్లా స్థాయి కమిటీకి జిల్లా మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా, రైతు భరోసా, రెవెన్యూ వ్యవహారాలు చూసే జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్, మార్కెటింగ్‌ శాఖ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, కేవీకేలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ప్రిన్సిపల్‌ సైంటిస్టులతోపాటు పది మంది రైతులు సభ్యులుగా ఉంటారు.

– మండల స్థాయి కమిటీకి ఎమ్మెల్యే చైర్మన్‌గా, మండల పరిషత్‌ అధ్యక్షుడు వైస్‌ చైర్మన్‌గా, మండల వ్యవసాయ అధికారి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. తహసీల్దార్, ఎంపీడీవో, హార్టీ, సెరీ కల్చర్‌ అధికారులు, ఐదుగురు రైతులు సభ్యులు ఉండనున్నారు.